ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరానగర్‌లో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ యువతి తన తల్లి చనిపోయినా కూడా పదిరోజుల వరకు ఆమెతోనే ఉంది. దీంతో ఆ ఇంట్లో నుంచి వాసన రావడంతో చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు షాక్ తిన్నారు. ఆమె తల్లి చనిపోయినా కూడా ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా మృతదేహం వద్ద ఉన్న ఆమెను చూసి అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యపోయారు. కన్నతల్లి మృతదేహంతో అన్ని రోజులు ఉన్న ఆ యువతి అంకిత దీక్షిత్‌గా గుర్తించారు.
సునీత దీక్షిత్ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లో ఉద్యోగం చేసి రిటైర్ అయి ఇంటి వద్ద ఉంటున్నారు. ఆ ఇంట్లో తల్లికూతురు ఒంటరిగా నివసిస్తున్నారు. ఈ క్రమంలో సునితా దీక్షిత్ కన్నుమూసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. ఓ ఆడమనిషి గొంతు వినిపించింది. వెంటనే పోలీసులు లోనికి వెళ్లే ప్రయత్నం చేయగా.. అంకిత దీక్షిత్ వారిని ఇంట్లోకి రావొద్దూ అంటూ గట్టిగా కేకలు వేసింది. మొత్తానికి పోలీసులు ఇంట్లోకి ప్రవేశించగా తల్లి మృతదేహం వద్ద అంకిత కనిపించింది.
అప్పటికే అంకిత మానసికంగా కృంగిపోయి ఉంది.. పోలీసులు అడిగిన ప్రశ్నలకు పెద్దగా సమాధానం ఇవ్వలేకపోయింది. అయితే సునితా దీక్షిత్ సుమారు పది రోజుల క్రితం చనిపోయి ఉండవొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టు మార్టం పంపారు. ఇటీవల కాలంలో ఆమె క్యాన్సర్ తో బాధపడినట్లు తెలుస్తుంది. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత, దాని ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసుల తెలిపారు.