తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోవడం లేదని ఎన్నో ప్రేమజంటలు ఆత్మహత్యకు పాల్పపడిన సంఘటనలు వెలుగు చూశాయి. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడి తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదని మనస్థాపానికి గురై చిన్నవయసులోనే తనువు చాలిస్తున్నారు. కన్నవారికి గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు.
ప్రేమలో పడితే.. ఆ జంట ఈ లోకాన్ని మర్చిపోతారని అంటారు. తాము ప్రేమించిన వారి కోసం దేనికైనా సిద్ద పడతారు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించకుంటే ఎక్కడికైనా వెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకుంటారు.. పెద్దలను ఎదిరించే ధైర్యం లేని ప్రేమికులు ఆత్మహత్యలకు పాల్పపడుతుంటారు. ఓ ప్రేమజంట తమ ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అనుమతించలేదని ఏకంగా కొండ మీద నుంచి కిందికి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. కానీ అది కాస్త బెడిసి కొట్టింది. ఈ ఘటన బెంగళూరు చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
బెంగుళూరు రామనగర్ జిల్లాలో రామదేవర బెట్ట ప్రాంతంలో ఓ ప్రైవేట్ కాలేజ్ లో చేతన్ అనే యువకుడు బీఈ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అదే కాలేజ్ లో సాహిత్య అనే యువతి బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతుంది. గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇటీవల తమ ప్రేమ వ్యవహారం గురించి పెద్దలకు తెలిసిందే. దాంతో ప్రేమికులకు ఇరు కుటుంబ సభ్యులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇక ముందు ప్రేమ అనే ప్రస్తావన రావొద్దని తేల్చి చెప్పారు. దీంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించరు.. ఇక మనం చావుతోనే ఏకమవుదాం అని అనుకున్నారు. ఈ క్రమంలో శనివారం 11 గంటల ప్రాంతంలో సమీపంలోని ఓ పెద్ద కొండపై నుంచి దూకి చనిపోవాలని నిశ్చయించుకున్నారు.
ఈ క్రమంలోనే సుమారు 250 అడుగుల ఎత్తు ఉన్న కొండ ఎక్కి ఇద్దరూ దూకారు. కొండపై నుంచి దూకిన ప్రేమ జంట చెట్ల పొదల్లో ఇరుక్కుపోయారు.. దాంతో తమను రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేశారు. వారి ఆర్తనాదాలు విన్న స్థానికులు అక్కడి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పొదల్లో దాదాపు రెండు గంటల పాటు గాలించి మొత్తానికి ఇద్దరినీ రక్షించారు. అంత ఎత్తు నుంచి దూకడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే చేతన్, సాహిత్యను రాజరాజేశ్వరి హాస్పిటల్ కి తరలించి చికిత్స అందించారు.
ఇక ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సూసైడ్ లో తాము ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నామని.. తమ ప్రేమను ఇరు కుటుంబ పెద్దలు అంగీకరించకపోవడంతో చనిపోవాలని నిర్ణయం తీసుకున్నామని.. అందుకే కొండపై నుంచి దూకి చనిపోతున్నామని రాసి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ప్రేమికులు 250 అడుగుల ఎత్తు ఉన్న కొండపై నుంచి దూకి పొదల్లో చిక్కుకొని అదృష్టం కొద్ది బయట పడ్డారని.. అది ఎవరూ గమనించకుంటే ఖచ్చితంగా చనిపోయి ఉండేవారని పోలీసులు తెలిపారు.