మేజర్లు తమ ఇష్టపూర్వకంగా కలిసి ఉండటం తప్పేంకాదు అని ఇప్పటికే పలు న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. కానీ, షరతులు వర్తిస్తాయని తాజాగా రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చూస్తే అర్థమవుతుంది. తమకు పోలీసు రక్షణ కల్పించాలంటూ రాజస్థాన్ హైకోర్టును ఓ జంట ఆశ్రయించారు. అయితే రాజస్థాన్ హైకోర్టు మాత్రం వారి పిటిషన్‌ను తిరస్కరించింది.
ఓ ముప్పై ఏళ్ల మహిళ, 27 ఏళ్ల యువకుడు సహజీవనం చేస్తున్నారు. వారికి కొంతకాలంగా బెదిరింపులు రావడంతో హైకోర్టును ఆశ్రయించారు. ‘మేమిద్దరం మేజర్లం, ఇష్టపూర్వకంగానే కలిసి ఉంటున్నాం. మాకు పోలీసు రక్షణ కల్పించండి’ అని మహిళ, యువకుడు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌దారులలో మహిళకు గతంలోనే వివాహం జరిగింది. ఆమె, భర్త నుంచి విడాకులు తీసుకోలేదు. భర్త క్రూరమైన ప్రవర్తన వల్లే తాను విడిగా ఉండాల్సి వస్తోందని మహిళ తెలిపింది.
ఇరువురి వాదనలు విన్న తర్వాత జస్టిస్ సతీశ్ కుమార్ శర్మ పిటిషన్‌ను తిరస్కరించారు. విడాకులు తీసుకోకుండా వేరొకరితో కలిసి ఉండటం వివాహేతర సంబధమే అవుతుందన్నారు. ఇలాంటి బంధాలకు రక్షణ కల్పించడం అంటే పరోక్షంగా వాటికి సమ్మతి తెలిపినట్లే అవుతుందని జస్టిస్ సతీశ్‌కుమార్ స్పష్టం చేశారు. వారికి ఆపద వస్తే పోలీసులను ఆశ్రయించి రక్షణ పొందవచ్చని రాజస్థాన్ హైకోర్టు తెలిపింది.