నేరాలపై విచారణ జరిగే న్యాయస్థానంలో నిందితులు, సాక్షులు, న్యాయవాదులు, పోలీసులు హాజరవుతారు. వాదనలు వినేందుకు సాధారణ ప్రజలతో పాటు జర్నలిస్టులు తదితరులు కూడా కోర్టులకు వస్తుంటారు. ఇంతవరకు ఓకే, గానీ కోర్టులో చిరుత పులి వస్తే పరిస్థితేంటి? అవును, అడవిలో ఉండాల్సిన చిరుత పులి కోర్టులోకి దూసుకొచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో చోటుచేసుకుంది. కోర్టు పరిసరాల్లోకి ప్రవేశించిన ఓ చిరుతపులి.. అక్కడ హల్‌చల్ చేసి పలువురి మీద దాడి చేసింది. కోర్టు వేళలు ముగిసే సమయంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్‌లో ఉన్న జిల్లా కోర్టులో చిరుత పులి కలకలం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకునేలోపే కోర్టులో కలియదిరిగిన చిరుత.. అక్కడున్న పలువురిపై దాడి చేసి గాయపర్చింది. అడ్డొచ్చిన వారిపై అటాక్ చేసింది. దీంతో గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దాదాపు నాలుగు గంటల పాటు అటవీ శాఖ సిబ్బంది కష్టపడి చిరుతను బంధించారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. చిరుత దాడిలో ఇద్దరు న్యాయవాదులు, హెడ్ కానిస్టేబుల్, మరో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభిషేక్ శ్రీవాత్సవ తెలిపారు. చిరుత పులిని అటవీ శాఖ సిబ్బంది తరలించారని ఆయన వెల్లడించారు.
#WATCH | Several people injured as leopard enters Ghaziabad district court premises in Uttar Pradesh pic.twitter.com/ZYD0oPTtOl
— ANI (@ANI) February 8, 2023