మీ ఊరు దేనికి ప్రసిద్ధి అంటే.. మనం దేవాలయాలకో.. తినే ఆహార వస్తువులకో,లేదంటే మరొకటో చెప్తాము. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేలి జిల్లాలో ఓ ఊరుంది.పేరు చిరోటి గ్రామం.. దొంగతనాలకు.. బాగా ప్రసిద్ధి. వస్తువు ఏదైనా పోయిందా? జేబులో మొబైల్ ఫోన్ కానీ.. ఇంట్లో బంగారం గానీ.. పశువులు గానీ కనిపించడం లేదా? ఐతే అది ఖచ్చితంగా ఆ గ్రామంలోనే ఉంటుంది. అంతలా దొంగతనాలకు ఫేమస్ ఆ ఊరు. చుట్టుపక్కల వారంతా దానిని చోర్ విలేజ్‌గా పిలుస్తుంటారు. ఏదైనా దొంగతనం జరిగితే పోలీసులు కూడా ముందుగా ఆ గ్రామానికే వెళ్తుంటారు. తాజాగా అలాగే ఓ కేసును పరిష్కరించారు. మరి ఆ కేసు ఏంటి? పోలీసులు ఎలా పరిష్కరించారో తెలుసుకుందామా.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాల్‌పూర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన చాలా మేకలు ఉన్నాయి. ఇటీవల మేకలను అమ్మేందుకు పశువుల సంతకు వెళ్లాడు. అక్కడ కొందరు వ్యక్తులు మేకలు కొంటామని చెప్పి బేరం ఆడారు. కానీ వారికి కొనే ఉద్దేశం లేదు. తక్కువ ధర చెప్పడంతో.. అంత రేటుకు తాను అమ్మేది లేదని ఆ వ్యక్తి తేల్చి చెప్పాడు. ఇద్దరిమధ్య డీల్ కుదరకపోవడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సరైన బేరం రాకపోవడంతో ఆ వ్యక్తి ఓ వాహనంలో తన మేకలను తిరిగి ఇంటికి తీసుకెళ్తుండగా చోరీ జరిగింది. రాత్రివేళ కొందరు వ్యక్తులు రోడ్డుకు అడ్డంగా నిలబడి వాహనాన్ని ఆపి, కత్తితో వారిని బెదింరిచి మేకలతో ఉడాయించారు. ఈ ఘటనపై బాధితుడు లాల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. పఠారియా ప్రాంతంలోని చిరోటి గ్రామానికి చెందిన దొంగలే ఇలాంటి చోరీ చేస్తారని అనుమానించారు. ఓ బృందాన్ని ఆ గ్రామానికి పంపించి తనిఖీలు చేయించారు.
పోలీసులు అనుకున్నదే నిజమైంది. చిరోటి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులే మేకలను దొంగతనం చేశారు. వారి ఇళ్లల్లో 5 మేకలను గుర్తించారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరాన్ని ఒప్పుకున్నారు. మిగతా మేకలను బిలాయ్ తీసుకెళ్లి అమ్మేసినట్లు చెప్పారు. వారి వద్ద నుంచి వాహనంతో పాటు లక్షా 40వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు. స్థానికంగా చిరోటి గ్రామం పట్ల చెడు అభిప్రాయముంది. ఎందుకంటే ఆ ఊరిలో చాలా మంది దొంగలున్నారు. చుట్టుపక్కల ఏమైనా వస్తువులు పోతే పోలీసులు ముందుగా అక్కడికే వెళ్తుంటారు. వారిలో మార్పు తీసుకొచ్చేందుకు పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. మరి వీరెప్పుడు మారుతారో చూడాలి.