ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఆర్యన్ ఖాన్ బెయిల్ విషయంలో ప్రతిసారీ నిరాశే ఎదురువుతుంది. ఇదిలా ఉంటే.. సంచలనం సృష్టిస్తున్న ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో కీలకసాక్షిగా పరిగణిస్తున్న కిరణ్ గోసవి, ఆర్యన్ అరెస్ట్ సమయంలో అతనితో సెల్ఫీ దిగడం వివాదాస్పదంగా మారింది. ఇప్పటి వరకు డ్రగ్స్ కేసులో సాక్షిగా మారిన తర్వాత గోసవి పరారీలో ఉన్నాడు. ఈ కేసులో గోసావిని ‘స్వతంత్ర సాక్షి’ ఎన్సీబీ పేర్కొంది. కానీ సాక్షిగా గోసావి కోర్టుకు హాజరు కాలేదు. దీంతో అతని కోసం పోలీసులు వెతుకులాట మొదలు పెట్టారు. గోసవిపై అక్టోబర్ 14న పుణె పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అతడి కోసం పూణే పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి, ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నట్టు పూణే పోలీస్ కమిషనర్ అమితాబ్ గుప్తా వెల్లడించారు.
ఈ కేసులో కిరణ్ గోసవిని సాక్షిగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పేర్కొంది. కిరణ్ గోసవి తనను తాను ప్రైవేట్ డిటెక్టివ్ గా చెప్పుకునేవాడు. అయితే మూడురోజుల క్రితం అజ్ఞాతంలో ఉన్న తాను ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోతానని పేర్కొంటూ ప్రకటన చేసినట్లు సమాచారం. మహారాష్ట్రలో తనకు బెదిరింపులు వస్తున్నాయని.. ఉత్తరప్రదేశ్ పోలీసులకు లొంగిపోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. కానీ ఈ విషయాన్ని పోలీసుల త్రోసి పుచ్చారు. ఇదిలా ఉంటే.. కిరణ్ గోసవి కి ప్రభాకర్ సెయిల్ అనే వ్యక్తి బాడీగార్డు.
ప్రభాకర్ సెయిల్ కూడా డ్రగ్స్ కేసులో సాక్షిగా ఉన్నాడు. ఇటీవల సెయిల్ తన బాస్ కిరణ్ గోసవిపై సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ కేసు నుంచి ఆర్యన్ ఖాన్ ను తప్పించేందుకు గోసవి, ఎన్సీబీ మధ్య కోట్ల రూపాయల డీల్ కుదిరిందని సెయిల్ బాంబు పేల్చాడు. అప్పటి నుంచి ఈ కేసులో కొత్త ట్విస్టులు నెలకొంటూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కిరణ్ గోసవిని ఓ పాత కేసులో పూణే పోలీసుల అదుపులో ఉండగా, అతడిని ఎన్సీబీ అధికారులు తమకు అప్పగించాలని కోరే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఆర్యన్ ఖాన్ కేసులో కిరణ్ గోసవి అరెస్ట్ కావడంతో భారీ ట్విస్ట్ నెలకొంది. మరి ఈ కేసులో ఇంకా ఎన్ని సంచలన విషయాలు వెలుగులోకి రానున్నాయో చూడాలి. కాగా, ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై బాంబే హైకోర్టులో నేడు కూడా విచారణ జరగనుంది. గత రెండ్రోజులుగా బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడుతోంది.