ఈ మధ్య కాలంలో పెళ్లి మండపాలు వైరల్ సంఘటనలకు వేదికలుగా మారుతున్నాయి. పీటల మీద గొడవపడటం మొదలు.. నూతన వధూవరులు ఒకరినొకరు సర్‌ప్రైజ్ చేసుకునే సంఘటనల వరకు.. కాదేదీ వైరల్‌కు అనర్హం అన్నట్లుగా ఉంటున్నాయి. ఇక గతంలో పెళ్లి కుమార్తె.. మండపంలోకి వచ్చే సమయంలో.. సిగ్గు పడుతూ.. భయంభయంగా వచ్చేది. అయితే మారుతున్న కాలంతో పాటు.. మగువలు కూడా మారుతున్నారు. వైవాహిక జీవితంలోకి ఎంత సంతోషంగా ప్రవేశిసుస్తున్నామో తెలియజేయడం కోసం.. బైక్, కారు స్వయంగా నడుపుకుంటూ.. ఎంజాయ్ చేస్తూ మండపానికి వస్తున్నారు. బుల్లెట్ బండ్ల మీద.. ఎంట్రీ ఇచ్చే పెళ్లికుమార్తెల సంఖ్య ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది. ఇక తాజాగా ఓ నూతన వధువు.. బైక్, కారు కాదు.. ఏకంగా లారీలో మంటపంలోకి ఎంట్రీ ఇచ్చింది. అది కూడా కాబోయే భర్తని పక్కన కూర్చోబెట్టుకుని.. తానే స్వయంగా లారీ డ్రైవ్ చేస్తూ.. మరీ ఎంట్రీ ఇచ్చింది. ఈ వెరైటీ సంఘటన వివరాలు..
ఈ వెరైటీ ఎంట్రీ కేరళలో చోటు చేసుకుంది. నిశ్చితార్థం రోజున.. కాబోయే భర్తని లారీలో ఎక్కించుకుని.. చర్చిలోకి ఎంట్రీ ఇచ్చింది యువతి. ఇది చూసి బంధువుల ఆశ్చర్యపోయారు. ఇలా లారీలో ఎంట్రీ ఇచ్చిన యువతి పేరు దలీషా. ఆమె తండ్రి లారీ డ్రైవర్ కావడంతో.. దలీషాకు కూడా చిన్నప్పటి నుంచి లారీ డ్రైవింగ్ అంటే ఇష్టం. చదువు పూర్తయ్యాక లైసెన్స్ కూడా సంపాదించుకుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు తండ్రి లేకుండానే.. తానే స్వయంగా.. తమ పెట్రోల్ ట్యాంకర్ నడుపుకుంటూ.. కొచ్చి నుంచి పెట్రోల్ తెచ్చి.. మలప్పురం బంక్‌కు సరఫరా చేసేది. దలీషా ఇలా పెట్రోల్ ట్యాకంర్ నడుపుతుండగా.. కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. అవి తెగ వైరలయ్యాయి.
దలీషా డ్రైవింగ్ స్కిల్స్ చూసిన ఓ గల్ఫ్ కంపెనీ ఆమెకు ట్యాంకర్ డ్రైవర్‌గా ఉద్యోగం కూడా ఇచ్చింది. అక్కడ జాబ్ చేస్తుండగానే.. దలీషాకు కంజిరాపల్లికి చెందిన మరో డ్రైవర్ హాన్సన్‌తో పరిచయం ఏర్పడి.. అది కాస్త ప్రేమగా మారింది. ఇక తమ ప్రేమ గురించి తల్లిదండ్రులకు చెప్పి.. వారి అంగీకారంతో వివాహం చేసుకోబోతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం.. వీరికి స్థానికంగా ఉన్న ఓ చర్చిలో నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి.. దలీషా.. ప్రత్యేకంగా అలంకరించుకుని.. ట్యాంకర్ నడుపుకుంటూ.. చర్చికి వచ్చింది. ఆ సమయంలో భర్త హాన్సన్ కూడా దలీషాతో పాటు లారీలోనే ఉన్నారు. వీరిద్దరూ ఇలా లారీలో రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇద్దరికి ఇద్దరూ సరిపోయారు అంటూ నవ్వుకున్నారు.