మనది ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. మన ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకునే తీరిక, సమయం ఉండటం లేదు.. ఇక అలాంటిది మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే తీరక, సమయం ఇంకెక్కడ ఉంటుంది. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని.. దొరికే కొంచెం సమయాన్ని కూడా.. దానికే కేటాయిస్తున్నాం. ఏదైనా విచారకర సంఘటన గురించి తెలిస్తే.. ఏదో నాలుగు ముక్కలు కామెంట్స్ చేసి వదిలేస్తాం. ఆ తర్వాత మరో పోస్ట్.. మరో పోస్ట్. ఇలా కొనసాగుతుంది. అయితే సోషల్ మీడియాలో వచ్చే కొన్ని సంఘటనలు మనల్ని కదిలిస్తాయి. మనం మనుషులం.. బ్రతికే ఉన్నాం.. స్పందించాల్సిన అవసరం ఉందని తెలుపుతాయి. అలా మనలో వచ్చిన ఆ చిన్న స్పందన ఒకరి జీవితాన్ని నిలబెడుతుంది. తాజాగా సోషల్ మీడియా పుణ్యమా అని.. ఓ నిరుపేద కుటుంబంలో నవ్వులు విరిసాయి. మానవత్వం వెల్లివిరిసి.. బాధితులకు కొండంత అండ లభించింది. ఇంతకు ఎవరా బాధితులు.. వారికి లభించిన మద్దతు ఏంటంటే..
కేరళకు చెందిన ఓ మహిళ.. తన పిల్లలకు ఒక్క పూట.. పట్టెడన్నం పెట్టలేని దీనస్థితిలో ఉంది. తాను అంటే ఎలానో అలా ఆకలి బాధను భరిస్తుంది.. కానీ పిల్లలు. దాంతో మనసు చంపుకుని ఆ తల్లి.. ఓ మహిళను 500 రూపాయలు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించింది. బాధితురాలి పరిస్థితి తెలుసుకుని.. మానవత్వంతో స్పందించిన మహళ తనకు చేతనైన మేరకు 1000 రూపాయలు సాయం చేసింది. కానీ ఈ మొత్తం.. ఆ కుటుంబానికి ఏమూలకు సరిపోదని అర్థం అయ్యింది. వెంటనే సోషల్ మీడియా వేదికగా.. ఆ తల్లి అనుభవిస్తున్న కష్టాల గురించి తెలియజేసి.. సాయం చేయాల్సిందిగా అభ్యర్థించింది. ఈ పోస్ట్ ఎందరినో కదిలించింది. చాలా మంది మానవత్వంతో ముందుకు వచ్చి సాయం చేయడంతో.. 55 లక్షల రూపాయల వరకు వచ్చాయి. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
సుభద్ర అనే మహిళ కేరళ దక్షిణ ప్రాంతంలో నివాసం ఉంటుంది. ఆమెకు ముగ్గురు కుమారులు. చిన్న పిల్లవాడికి సెరిబ్రల్ పాల్సి అనే వ్యాధితో బాధపడుతున్నాడు. భర్త ఉన్నన్ని రోజులు.. బాగానే గడిచింది. కానీ దురదృష్టం కొద్ది.. కొన్నిరోజుల క్రితం సుభద్ర భర్త చనిపోవడంతో.. వారి పరిస్థితి దయనీయంగా మారింది. ముగ్గురు పిల్లల బాధ్యత సుభద్ర మీదనే పడింది. సరే ఏదో పని చేసి.. వారి కడుపు నింపుదామంటే.. చిన్న పిల్లాడికున్న వ్యాధి కారణంగా.. నిత్యం పిల్లాడి దగ్గరే ఉండాలి. అడుగు బయటకు పెట్టాడానికి వీల్లేని పరిస్థితిలో ఉంది.
భర్త చనిపోయాక.. ప్రారంభంలో కొందరు బంధువులు సాయం చేశారు.. కానీ ఇప్పుడు వారు కూడా.. పట్టించుకోవడం మానేశారు. ఇన్నాళ్లు ఎలాగో అలా గడుపుతూ వచ్చింది సుభద్ర. ఇక ఇంట్లో ఉన్న తిండి గింజలు అయిపో వచ్చాయి. పిడికెడు గింజలు మాత్రమే ఉన్నాయి. దాంతో ఏం చేయాలో సుభద్రకు అర్థం కాలేదు. ఇక విధిలేని పరిస్థితుల్లో.. మనసు చంపుకుని.. ఓ టీచర్‌ని సాయం కోరింది. తన రెండో కుమారుడు ఆ టీచర్ దగ్గర చదువుతున్నాడు. ఆ పరిచయం కొద్ది.. ధైర్యం చేసి ఓ 500 రూపాయలు ఇవ్వమని టీచర్‌ని అడిగింది సుభద్ర.
సుభద్ర పరిస్థితి గురించి ఆ టీచర్‌కు తెలుసు కాబట్టి.. వెంటనే 1000 రూపాయలు సాయం చేసింది. కానీ ఈ మొత్తం వారికి దేనికి సరిపోవని టీచర్‌కు తెలుసు. ఇక ఆ టీచర్.. సుభద్ర ఇంటికి వెళ్లి చూడగా.. అక్కడ ఏ మూల చూసిన దరిద్రం తాడవిస్తుంది. వంటగదిలో తినడానికి ఏం లేవు. ఆ పరిస్థితులు చూసి టీచర్ మనసు చలించింది. ఏదో పరిష్కారం చూపాలని భావించింది. వెంటనే సుభద్ర పరిస్థితిని వివరిస్తూ.. ఆమెకు సాయం చేయాల్సిందిగా కోరుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్త వైరలయ్యింది. ఇక సుభద్ర బ్యాంకు వివరాలను కూడా దానిలో వెల్లడించింది. ఈ పోస్ట్ చూసి.. చాలా మంది స్పందించారు. తమకు తోచినంత మొత్తాన్ని.. సుభద్ర బ్యాంకు అకౌంట్‌కు పంపించారు.
ఇలా మొత్తం 55 లక్షల రూపాయల వరకు వచ్చాయి. తాను 500 కోరితే.. ఏకంగా 55 లక్షల రూపాయల సాయం లభించడం పట్ల సుభద్ర సంతోషం వ్యక్తం చేసింది. తన కష్టాలు తీరతాయని.. బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలననే ధైర్యం వచ్చిందని వెల్లడించింది. తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. మానవత్వం బతికుందనడానికి నిదర్శనం ఈ సంఘటన అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.