స్మార్ట్‌ఫోన్ లేని జీవితాలను ఊహించుకోలేని పరిస్థితుల్లో బతుకుతున్నాం. మన నిత్య జీవితంలో భాగం అయిన స్మార్ట్ ఫోన్ అప్పుడప్పుడు ప్రాణాలు కూడా తీస్తోంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
స్మార్ట్ ఫోన్ మన జీవితాల్లో భాగం అయిపోయింది. ఎంతలా అలవాటు పడ్డాము అంటే.. ఫోన్ లేకుండా ఒక్క గంట కూడా బతకలేని పరిస్థితికి వచ్చేశాం. నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఫోన్‌లోనే గడిపే వారి సంఖ్య చాలా ఎక్కువ. పెద్దలు మాత్రమే కాక ఈ కాలంలో చిన్నారులు కూడా స్మార్ట్‌ఫోన్‌కు అలవాటు పడుతున్నారు. ఆరు నెలల కాలం నుంచే పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడకం మొదలు పెడుతున్నారు. ఫోన్ ఇస్తేనే ఏడుపు ఆపుతున్నారు.. అన్నం తింటున్నారు. తల్లిదండ్రులు కూడా వారి పనులు చూసుకోవడం కోసం పిల్లలు స్మార్ట్ ఫోన్ ఇచ్చి ఆ అలవాటు మరింత పెంచుతున్నారు. ఇక ఏడాది వయసు నుంచే సెల్‌లో గేమ్‌లు ఆడుతూ.. గంటల తరబడి ఫోన్‌కు అతుక్కుపోతున్నారు పిల్లలు. ఫలితంగా చిన్నతనం నుంచే కంటి చూపు మందగించడం, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు.
ఇక తాజాగా ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. స్మార్ట్ ఫోన్.. ఓ చిన్నారి ప్రాణాలు బలి తీసుకుంది. బాధితురాలు గేమ్ ఆడుతుండగా.. ఫోన్ పేలిపోయింది. దాంతో చిన్నారి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన కేరళ, త్రిస్సూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పత్తిపరంబుకు చెందిన ఆదిత్యశ్రీ అనే 8 ఏళ్ల బాలిక మూడవ తరగతి చదువుతోంది. బాలిక నిత్యం స్మార్ట్‌ఫోన్‌లో గేమ్‌లు ఆడుతూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా సోమవారం రాత్రి కూడా అలానే గేమ్స్ ఆడుతుండగా.. 10.30 గంటల ప్రాంతంలో ఫోన్ పేలిపోయింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందింది.
ఆదిత్యశ్రీ గ్యాప్ లేకుండా.. గంటల తరబడి.. ఫోన్‌లో గేమ్‌లు ఆడుతుందని.. దాంతో అది హీటెక్కిందని చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు. పైగా చార్జింగ్ పెట్టి ఉండటం, వేసవి కాలం కావడంతో.. హీట్ మరింత పెరిగి ఫోన్ పేలిపోయింది అని తెలిపారు. ఆదిత్యశ్రీ మృతితో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పజ్యన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఫోరెన్సిక్ తనిఖీలు నిర్వహించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. చార్జింగ్ పెట్టి.. ఫోన్ వాడటం చాలా ప్రమాదమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.