అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా పలకరిస్తుందో చెప్పలేం. చావు అంచుల వరకు వెళ్లిన వారు కూడా అదృష్టం బాగుంటే.. మృత్యువును జయించి వెనక్కి రాగలరు. ఈమధ్య కాలంలో జస్ట్ వెంట్రుక వాసిలో ప్రమాదాల నుంచి బయటపడ్డ వారి గురించి కూడా వింటున్నాం. ఇదిగో ఇలా ఆఖరి నిమిషంలో అదృష్టం తలుపు తట్టిన ఓ వ్యక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 50 ఏళ్ల ఓ వ్యక్తి.. కుటుంబ పోషణ నిమిత్తం ఎడాపెడా అప్పులు చేశాడు. అదేమో కొండలా పెరిగిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దాంతో.. చేసేదేం లేక.. తాము ఉంటున్న ఇంటిని అమ్మకానికి పెట్టాడు. మరో 2 గంటల్లో ఇంటి అమ్మకం పూర్తి అవుతుంది. అదిగో సరిగ్గా అప్పుడే అనుకోని ఓ అద్భుతం చోటు చేసుకుంది. 2 గంటలు గడిస్తే.. కట్టుబట్టలతో రోడ్డు మీదకు రావాల్సిన వ్యక్తిని అదృష్టం పలకరించింది. ఆఖరి నిమిషంలో ఏకంగా కోటి రూపాయల లాటరీ తగిలింది. చదువుతుంటే సినిమా క్లైమాక్స్ సీన్‌లా ఉద్విగ్నంగా అనిపిస్తుంది కదా.. మరి పూర్తి వివరాల మీద ఓ లుక్కేయండి.
కేరళలోని కోయ్‌కోడ్‌కు చెందిన 50 సంవత్సరాల మహమ్మద్ బవ పెయింటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య అమీనా, ఐదుగురు పిల్లలున్నారు. వీరిలో నలుగురు ఆడ పిల్లలు కాగా, ఒకరు అబ్బాయి. ఇద్దరు అమ్మాయిలకు పెళ్లిళ్లు అవ్వగా.. మరో ఇద్దరు 12వ తరగతి చదువుతున్నారు. 22 ఏళ్ల కొడుకు నిజాముద్దీన్ మూడు వారాల కిందట ఖతార్ వెళ్లాడు. అయితే, పిల్లల పెళ్లిళ్లు, కొడుకు ఖతార్ వెళ్లడం కోసం మహమ్మద్ భారీగా అప్పులు చేసేశాడు. భార్య అమీనా పేర బ్యాంక్‌లో రూ.10 లక్షల లోన్, ఇంకో రూ.20 లక్షల అప్పు తీసుకొని ఇల్లు కట్టడం, ఆ తర్వాత పిల్లల పెళ్లి చేయడంతో భారీ అప్పయింది. ఈ అప్పులు ఎలా తీర్చాలో తెలియని మహమ్మద్ రూ.40 లక్షలకు ఇంటిని అమ్మేందుకు సిద్ధమై పార్టీతో కూడా అన్నీ మాట్లాడేసి అద్దె ఇంట్లోకి వెళ్లేందుకు రెడీ అయ్యాడు.
ఇల్లు అమ్మేందుకు ఆదివారం రోజున మొత్తం సిద్ధం చేసుకున్నారు. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు బయ్యర్‌తో వస్తానని బ్రోకర్ చెప్పేశాడు. మహమ్మద్ బవ రూ.45 లక్షలకు అడగ్గా.. అవతలి పార్టీ రూ.40 లక్షలకు రేటు ఫిక్స్ చేసేశారు. అయితే, తన కష్టాలు ఏదో రోజు లాటరీ ద్వారానే తీరుతాయి అని గట్టిగా నమ్మిన బవ.. గత నాలుగు నెలల నుంచి కేరళ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న లాటరీ కొనుగోలు చేస్తూ ఉన్నాడు. ఆ అలవాటులో భాగంగానే ఆదివారం సాయంత్ర 5 గంటలకు ఇల్లు అమ్మనుండగా.. బవ మధ్యాహ్నం 1 గంట సమయంలో బయటకెళ్లి ఫిఫ్టీ-ఫిఫ్టీ లాటరీకి సంబంధించిన నాలుగు టికెట్లు కొనుక్కున్నాడు.
ఆదివారం సరిగ్గా 3 గంటల ప్రాంతంలో డ్రా తీయగా.. మహమ్మద్ బవాకి జాక్‌పాట్ తగిలింది. ఏకంగా కోటి రూపాయల లాటరీ రావడంతో వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ట్యాక్స్‌లు అన్నీ తీసేసి రూ.63 లక్షల వరకు బవ పొందనున్నాడు. 5 గంటలకు ఇల్లు అమ్మేయాలనగా.. 3 గంటలకు కోటి రూపాయల లాటరీ తగిలిందంటే అతన్ని అదృష్టవంతుడు గాక ఏమంటారు అంటున్నారు ఈ విషయం తెలిసిన వారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.