భర్త కోసం భార్య పడిన ఆవేదన ముగిసింది. తండ్రి కోసం ఓ పాప పడిన తపన నేటితో తెరపడింది. అక్రమంగా, అన్యాయంగా తన తండ్రిని అరెస్టు చేయగా.. అతడి కోసం ఆ పాప చిన్నపాటి పోరాటమే చేసింది. హక్కుల అంటేనే సరిగ్గా తెలియని వయసులో తన తండ్రికి దక్కాల్సిన హక్కుల గురించి మాట్లాడి దేశమంతా ఆశ్చర్య పరిచేలా చేసింది. రెండేళ్ల తర్వాత జైలు గోడల నుండి బయట పడిన తండ్రి కోసం పాప ఎదురు చూస్తోంది. ఆ పాప మరెవరో కాదూ మెహనాజ్.. ఆమె తండ్రి కేరళ జర్నలిస్ట్ సిద్దిఖీ కప్పన్. ఇంతకీ ఎవరా సిద్దిఖీ కప్పన్, ఏమిటా స్టోరీ తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్ లోని హథ్రాస్ లో 2020 అక్టోబర్ లో దళిత యువతిపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ యువతి.. ఆసుప్రతిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఈ ఘటనలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఉత్తరప్రదేశ్ పోలీసులు.. ఆమె మృతదేహానికి అర్థరాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. ఇదీ దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై రిపోర్టు చేసేందుకు కేరళ నుండి సిద్దిఖీ కప్పన్ బృందం ఉత్తరప్రదేశ్ కు బయలు దేరింది. అయితే మధుర టోల్ ఫ్లాజా వద్దకు రాగానే వారిని యుపి పోలీసులు అరెస్టు చేశారు. తాము జర్నలిస్టులమని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. కప్పన్ పై దేశ ద్రోహం, చట్ట విరుద్ధ కార్యాకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసులు బనాయించారు.
వీటితో పాటు నిషేధిత పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ)కి అక్రమంగా నిధులు సమీకరించారంటూ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కూడా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తప్పుడు కేసులు బనాయించింది. అప్పటి నుండి బెయిల్ రాక జైలులోనే ఉన్నారు. గత ఏడాది ఓ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. పలు కేసులు పెండింగ్ లో ఉండటంతో ఆయన విడుదల కాలేదు. రెండేళ్లకు పైగా జైలులో మగ్గారు. ఎట్టకేలకు బెయిల్ లభించడంతో గురువారం బెయిల్ పై విడుదలయ్యారు. మనీలాండరింగ్ కేసులో రూ. లక్ష చొప్పున ఇద్దరు పూచీకత్తు సమర్పించడంతో గురువారం ఉదయం 9.15 గంటలకు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
‘సుమారు నేను 28 నెలల పాటు జైలు జీవితాన్ని గడిపాను. నాపై తప్పుడు కేసులు బనాయించారు. ఈ రెండేళ్లు చాలా కఠినంగా గడిచాయి. నన్ను జైలులో ఉంచడం వల్ల ఎవ్వరికీ లాభం చేకూరుతుందో అర్థం కావడం లేదు. అయినా నేను భయపడను. కఠినమైన చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాను. నాకు మద్దతుగా నిలిచిన మీడియాకు ధన్యవాదాలు. బయటకు వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు’. కాగా, గత ఏడాది తన జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిఖీ కూతురు చేసిన ప్రసంగం వైరల్ గా మారింది.
తనను తాను సిద్దిఖీ కుమార్తెగా పరిచయం చేసుకున్న మెహనాజ్.. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి చర్చించింది. దేశంలో జరుగుతున్న పలు అంశాలను లెవనెత్తిన బాలిక..ప్రతి భారతీయుడికి మాట్లాడే స్వేచ్ఛ ఉందంటూ తన తండ్రినుద్దేశించి ప్రసంగించి.. ఔరా అనిపించింది. ఎట్టకేలకు జైలు నుండి విడుదలైన అతడి కోసం భార్య, కుమారుడు వేచి ఉన్నారు. రెండేళ్ల పాటు తండ్రి ప్రేమకు దూరంగా ఉన్న తనయ.. అతడి రాకకై ఎదురుచూస్తూ ఉంది.
Lucknow, Uttar Pradesh | Kerala journalist Siddique Kappan who was booked by the UP government under the Unlawful Activities Prevention Act (UAPA) released from jail after he was granted bail. pic.twitter.com/iW02VwqprG
— ANI (@ANI) February 2, 2023