టేకు చెట్లకు ఎంత డిమాండ్ ఉంటుందనేది తెలిసిందే. ఇళ్లు, వ్యాపార సముదాయాల్లో టేకుతో చేసిన సామాగ్రిని వినియోగించడం ఈ మధ్య ఎక్కువైంది. ఈ తరహా ఉత్పత్తులకు మంచి ధర పలుకుతుండటంతో టేకు చెట్ల పెంపకం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఓ టేకు చెట్టు.. వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది.
భూ గ్రహంపై అత్యంత నిస్వార్థమైనవిగా చెట్లను చెబుతుంటారు. అవి కార్బన్ డైయాక్సైడ్ తీసుకుని మనుషులకు ఆక్సిజన్‌ను ఇస్తాయి. ప్రాణవాయువు లేకపోతే మనుషులు బతకలేరు. అలాంటి మనుషులకు ప్రాణం పోసేవిగా వీటిని చెప్పొచ్చు. పండ్లు, పువ్వులు, కలప.. ఇలా ఎన్నో రకాలుగా మానవ మనుగడ, నాగరికత ముందుకెళ్లడంలో చెట్లది విస్మరించలేని పాత్ర. ఇక, ఈమధ్య టేకు చెట్లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. అలాంటి ఓ చెట్టే ఇప్పుడు ప్రభుత్వానికి మంచి ఆదాయాన్ని సమకూర్చింది. కేరళలో 114 ఏళ్ల కింద బ్రిటిషర్లు నాటిన నీలాంబరి టేకు చెట్టుకు వేలంలో రికార్డు ధర పలికింది. అటవీ శాఖ అధికారులు నిర్వహించిన వేలంలో ఈ టేకును దాదాపు రూ.40 లక్షలకు కొనుగోలు చేశారు.
పూర్తిగా ఎండిపోయిన ఈ పురాతన టేకు వృక్షం కేరళ ప్రభుత్వ అధీనంలోని సంరక్షణ ప్రాంతంలో కూలిపోయింది. దీన్ని స్వాధీనం చేసుకుని ఆఫీసర్స్.. నెదుంకాయం అటవీ డిపోలో వేలంలో ఉంచారు. బృందావన్ టింబర్స్ యజమాని అజీశ్ కుమార్ దీన్ని రూ.39.25 లక్షలకు కొనుగోలు చేశారు. ఈ టేకును 1909లో బ్రిటిషర్లు నాటారు. అప్పటినుంచి దీన్ని అటవీ అధికారులు కాపాడుతూ వచ్చారు. ఇక, కావాలని కొట్టేసిన వృక్షాలను వేలంలో ఉంచరు. ఎండిపోయి, దానంతట అదే కింద పడిన చెట్లను మాత్రమే వేలంలో ఉంచుతారు. తాజాగా వేలంలో రికార్డు ధర రావడంపై నెదుంకాయం డిపో అధికారి షెరీఫ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది అత్యంత నాణ్యమైన టేకు అని.. ఈ ధర రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచంలోనే టేకును తొలిసారిగా పెంచడం ఇక్కడే ప్రారంభమైందని షెరీఫ్ చెప్పారు.