రియాలిటీ గేమ్ షోలలో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతిగా నిర్వహించే ఈ షో.. తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే పేరుతో నిర్వహించబడుతుంది. ప్రస్తుతం హిందీలో కౌన్ బనేగా కరోడ్ పతి 14వ సీజన్ జరుగుతోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోకి దేశవ్యాప్తంగా కోట్లమంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే.. ఇలాంటి షోల ద్వారా ప్రేక్షకుల జనరల్ నాలెడ్జ్ పెరగడమే కాకుండా ఎన్నో కొత్త విషయాలు తెలుస్తుంటాయి. అలాగే ఈ షోలో కంటెస్టెంట్స్ గా పాల్గొనేవారు కూడా ఎంతోకొంత గెలుచుకొని వెళ్తుంటారు.
ఇటీవల ఎపిసోడ్ లో ప్రధాని మోదీ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియక గేమ్ నుండి క్విట్ అయిపోయాడు ఓ కంటెస్టెంట్. దీంతో ఆ వ్యక్తి 25 లక్షలు గెలుచుకునే అవకాశాన్ని చేజార్చుకుని వార్తల్లో నిలిచాడు. రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో జమ్మూ కాశ్మీర్ కి చెందిన విశాల్ శర్మ అనే స్టూడెంట్.. హోస్ట్ అమితాబ్ కి ఎదురుగా హాట్ సీట్ లో కూర్చున్నాడు. ఇక మొదటి ప్రశ్నగా హిందీలో ‘చంపి’ అని ఎక్కడ ఉపయోగిస్తారనే ప్రశ్నకు.. సరైన సమాధానంగా మసాజ్ లో అని చెప్పాడు విశాల్. అలా గేమ్ లో వరుసగా సరైన సమాధానాలు చెబుతూ రూ. 12.50 లక్షలు గెలుపొందాడు. దీంతో 25 లక్షల ప్రశ్న ఎదురైనప్పుడు ఒక్కసారిగా తడబడ్డాడు విశాల్.
25 లక్షల ప్రశ్నగా అమితాబ్.. ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన ప్రశ్న అడిగాడు. ‘2014లో అధికారంలోకి వచ్చాక మోడీ ఇప్పటివరకు ఏ దేశాన్ని సందర్శించలేదు?’ అనేది ప్రశ్న. దానికి ఆప్షన్స్ గా మొజాంబిక్, ఈజిప్టు, లావోస్, ఫిలిప్పీన్స్ ఉన్నాయి. ఆ ప్రశ్నకు సమాధానం తనకు తెలియదని విశాల్ చెప్పేశాడు. అలాగే రిస్క్ కూడా చేయలేనని చెప్పి, గేమ్ నుండి క్విట్ అయిపోయాడు. అనంతరం ఆన్సర్ గెస్ చెయ్ అని విశాల్ ని అడగ్గా.. లావోస్ అని చెప్పాడు. దీంతో ఆన్సర్ అది కాదని.. ఈజిప్టు అని చెప్పి, అమితాబ్ రూ. 12.50 లక్షల చెక్ ని విశాల్ కి అందజేశాడు. ప్రస్తుతం విశాల్ శర్మ నేషనల్ వైడ్ వార్తల్లో హైలైట్ అవుతున్నాడు.