ఈరోజుల్లో కడుపు నిండా మంచి రుచికరమైన భోజనం తినాలంటే కనీసం రూ. 150 అయినా పెట్టుకోవాలి. ఇక అన్ లిమిటెడ్ ఫుడ్ తినాలంటే రూ. 600 నుంచి రూ. 1000 పెట్టుకోవాలి. అలాంటిది ఒక రెస్టారెంట్ లో రూ. 60కే ఎంత కావాలంటే అంత ఫుడ్ పెడతారు. కానీ ఒక కండిషన్ ఉందండోయ్. ఆ కండిషన్ కి అంగీకరిస్తేనే అన్ లిమిటెడ్ ఫుడ్ కి అర్హులు. ఇంతకే ఆ కండిషన్ ఏమిటి? రూ. 60కే అపరిమిత భోజనం పెట్టే రెస్టారెంట్ విశేషాలు ఏమిటి?
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కర్నావత్ రెస్టారెంట్ ఒకటి ఉంది. ఈ రెస్టారెంట్ లో ఎంత కావాలంటే అంత తినచ్చు. రూ. 60కే కావాల్సినంత వడ్డిస్తారు. కానీ కింద పడకుండా తినాల్సిన బాధ్యత కస్టమర్లది. అలా అయితేనే అన్ లిమిటెడ్ ఫుడ్ సర్వ్ చేస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని, ఒక్క మెతుకు కూడా వృధా చేయకూడదని పెద్దలు అంటారు. ఒక్క మెతుకు కూడా కింద పడకుండా తినమని పెద్దలు చెబుతారు. అయితే కొంతమంది తినే స్థాయి కంటే ఎక్కువ పెట్టుకుని ఫుడ్ వృధా చేస్తుంటారు. ఇంట్లో, రెస్టారెంట్ లో ఎక్కడైనా సరే కొంతమంది ఆఖరున ఫుడ్ వదిలేస్తుంటారు. అలాంటి వారిలో మార్పు తెచ్చేందుకు కర్నావత్ రెస్టారెంట్ ఈ ఆఫర్ ను ప్రకటించింది. ఎవరికి ఎంత కావాలంటే అంత వడ్డిస్తారు.
అయితే ఒక్క మెతుకు కూడా కింద పడకుండా తినాలని రెస్టారెంట్ కండిషన్ పెట్టింది. అంతేకాదు ఒక్క మెతుకు కింద పడేసినా జరిమానా విదిస్తుంది. అలా అని వందలు, వేలు కాదండోయ్. కేవలం రూ. 50లే. ఈ ఆఫర్ వల్ల రూ. 60కే అన్ లిమిటెడ్ ఫుడ్ తినేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని, అయితే కింద పడేస్తే జరిమానా కట్టాల్సి వస్తుందని చాలా జాగ్రత్తగా తింటున్నారని రెస్టారెంట్ వారు చెబుతున్నారు. తాము పెట్టిన ఈ ఆఫర్ వల్ల కస్టమర్లకు ఫుడ్ విషయంలో క్రమశిక్షణ వస్తుందని, అన్నిటికంటే బాధ్యత వస్తుందని అంటున్నారు. రైతులు ఎంతో కష్టపడి ధాన్యం పండిస్తారని.. దాని కోసం ఆరు నెలలు ఎదురుచూస్తారని.. కాబట్టి అన్నం విలువ ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ పెట్టినట్లు వెల్లడించారు.
నిజానికి తక్కువ ధరకు అపరిమిత భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టారట ఈ రెస్టారెంట్ ని. అయితే అపరిమితం అనగానే ఎక్కువ పెట్టించుకుని వదిలేస్తారన్న భయంతో జరిమానా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీంతో ఈ హోటల్ అక్కడ బాగా ఫేమస్ అయిపోయింది. రోజూ అనేక మంది ఈ రెస్టారెంట్ కి వెళ్లి సరసమైన ధరకు కడుపు నిండా భోజనం చేస్తున్నారు. అయితే జరిమానా విధించిన తర్వాత కస్టమర్లు వదిలిపెట్టిన ఫుడ్ ని పారేయకుండా అవసరమైన వారికి ఇస్తున్నామని రెస్టారెంట్ యజమాని అరవింద్ కర్నావత్ వెల్లడించారు. మరి రూ.60కే అపరిమిత ఫుడ్ అందిస్తున్న ఈ రెస్టారెంట్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.