దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై పురుషుల లైంగి వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ఇలాంటి వారిలో మార్పు రావడం లేదు. మహిళలను దేవతలతో సమానంగా చూసే భారత దేశంలో కొంత మంది రాక్షసుల్లా మారుతూ వారిపై దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల తిరిగి క్షేమంగా ఇల్లు చేరుతుందన్న భరోసా లేకుండా పోయింది. సామాన్యులే కాదు ప్రముఖులు, చదువుకున్న వారిపైనా ఈ దారుణాలు జరుగుతున్నాయి.
ఓ వ్యక్తి నడి రోడ్డు పై అందరూ చూస్తుండగానే ఒక మహిళా న్యాయవాదిపై అత్యంత పాశవికంగా దాడి చేశాడు. ఆమె కడుపులో తన్నుతూ దూరంగా నెట్టివేశాడు. ఆ సమయంలో అడ్డు వచ్చిన భర్తపై కూడా దారుణంగా దాడి చేశాడు. కాగా, దాడి చేసిన వ్యక్తి మహంతేశ్ చొలచగడ్డ అని ఆయన ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఇక దాడికి గురైన మహిళా న్యాయవాది పేరు సంగీత షిక్కేరి.
కర్ణాటకకు చెందిన వీరిద్దరి మద్య కొంత కాలంగా ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే మహిళా న్యాయవాది సంగీత షిక్కేరి కి మహంతేశ్ మద్య మాటా మాటా పెరిగడంతో దాడి చేశాడని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని మహంతేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సంగీత, ఆమె భర్త బాగల్ కోట్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.