అసెంబ్లీ ఎన్నికల వేల బోణీ కపూర్ కారులో భారీగా వెండి వస్తువులు పట్టుబడటం కలకలం రేపుతోంది. మొత్తం ఐదు బాక్సుల్లో చెన్నై నుంచి ముంబయి తరలిస్తున్న ఈ వస్తువులకు సరైన పత్రాలు చూపించకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఒకేసారి ఇన్ని కిలోలు పట్టుబడటం పలు అనుమానాలకు తావిస్తోంది.
దేశంలో ఎప్పుడు.. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటర్లను ప్రలోభాలు పెట్టడమన్నది కామన్. రాజకీయ నాయకులు వారి వారి స్తోమతను బట్టి, నేతల క్యాడర్ ను బట్టి నగదు రూపంలోనో.. గిఫ్ట్ రూపంలోనో ఓట్ ఫర్ మనీ ఇస్తుంటారు. ఇందులో ఓటర్ల స్థాయిని కూడా లెక్కలోకి తీసుకొని కొందరికి మందు బాటిళ్లు.. మరొకొందరికి బిర్యానీ పొట్లాలు అందజేస్తుంటారు. ఇక్కడ ఓటర్లు తిని.. తాగి ఎన్నాళ్ళయ్యిందో అన్నట్లుగా లాబుక్కున లాగేసుకొని.. బుటుక్కున మింగేస్తుంటారు. కర్ణాటకలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్నందున ప్రస్తుతం అక్కడా ఇదే కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఈసీ అప్రమత్తమై రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో దావణగెరేలోని హెబ్బాళ్ టోల్‌గేట్ సమీపంలో ఈసీ తనిఖీల్లోబాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌కు చెందిన ఓ కారులో 66 కేజీల వెండి వస్తువులు దొరికడం… ఆ కారు బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌కి చెందిన కంపెనీ పేరున రిజిస్టర్ అయివుండడం… సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొత్తం ఐదు బాక్సుల్లో చెన్నై నుంచి ముంబయి తరలిస్తున్న ఈ వస్తువులకు సరైన పత్రాలు చూపించలేదు. దీంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులో వెండి గిన్నెలు, స్పూన్లు, ప్లేట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.39లక్షల పైనే ఉంటుందని వెల్లడించారు.
పట్టుబడిన కారు బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌కి చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై రిజిస్టరై ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. కారు డ్రైవర్ సుల్తాన్ ఖాన్ సహా కారులో ప్రయాణిస్తోన్న మరో వ్యక్తి హరిసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. హరి సింగ్‌ను విచారించగా.. ఆ వస్తువులు బోనీ కపూర్ కుటుంబానికి చెందినవేనని చెప్పినట్లు సమాచారం. అయితే ఈ వస్తువులు బోనీ కుటుంబానికి చెందినవా? కాదా..? అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రలోభ పెట్టడానికి తీసుకెళుతున్నారా..? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.