భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ మన రాజ్యాంగం, చట్టాలు కొన్ని హక్కులు కల్పించాయి. ఇక దళితులు, ఆదివాసీల విషయంలో మన దేశ చట్టాలు ఇంకాస్త బలంగా ఉంటాయి. అందుకే.. అట్రాసిటీ లాంటి కొన్ని చట్టాలు బలహీన వర్గాల వారికి వరంగా మారాయి. వారి ఆత్మాభిమానాన్ని, సమాజంలో వారి గౌరవాన్ని ఈ చట్టాలు ఉన్నతస్థాయిలో నిలబెట్టడానికి దోహదపడుతున్నాయి. నిజానికి ఎన్నో ఏళ్లుగా వివక్షబారిన పడిన వర్గాలకు ఇలాంటి చట్టాలు తోడుగా ఉండటం మంచి విషయమే. అయితే.. ఈ మధ్య కాలంలో అట్రాసిటీ చట్టాన్ని కొందరు నాయకులు, వ్యక్తులు మిస్ యూజ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు అట్రాసిటీ చట్టం విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఎస్సీ, ఎస్టీలను కులం పేరుతో ప్రస్తావిస్తూ ఏదైనా వ్యాఖ్యలు చేసినా అట్రాసిటీ కేసులు పెట్టడం ఈమధ్య చూస్తూనే ఉన్నాం. వీటిలో నిజానిజాలు ఏంటనేది పక్కనబెడితే.. పీడిత వర్గాల ప్రజలకు రక్షణగా ఉన్న అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేయడం మాత్రం తగదని న్యాయ నిపుణులు అంటున్నారు. కులం పేరుతో బడుగు వర్గాల ప్రజల్ని దూషిస్తే అండగా నిలిచే అట్రాసిటీ చట్టాన్ని.. కొందరు తమ స్వార్థం కోసం వాడుతూ దుర్వినియోగం చేస్తుండటంపై న్యాయ నిపుణులు పెదవి విరుస్తున్నారు. అయితే ఇష్టం వచ్చినట్లు అట్రాసిటీ కేసులు పెట్టడానికి వీల్లేదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. కించపరిచే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేస్తే తప్ప ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసులు పెట్టొద్దని కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పింది. కేవలం కులం పేరును ప్రస్తావించినంత మాత్రాన ఈ చట్టం కింద కేసు పెట్టలేరని పేర్కొంది.
తాజాగా కర్ణాటకలో ఒక మహిళ కుమారుడు కొందరితో కలసి క్రికెట్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతడి టీమ్ ఓడిపోవడంతో ప్రత్యర్థులతో వాదన జరిగింది. ఈ సందర్భంగా శైలేష్ కుమార్ అనే వ్యక్తి తన కొడుకును కులం పేరుతో దూషించి కొట్టారంటూ ఆ మహిళ ఫిర్యాదు చేసింది. శైలేష్ కుమార్ మీద ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. మ్యాచ్ ముగిసిన సందర్భంలో తలెత్తిన గొడవ కారణంగానే తాను ఆ మాటలు అన్నానే తప్ప.. కులం పేరుతో కించపరచాలని కాదని కోర్టుకు తెలిపాడు. దీంతో ఏకీభవించిన ధర్మాసనం.. ఈ సందర్భంగా పైవ్యాఖ్యలు చేసింది. కించపరిచే ఉద్దేశంతో కాకుండా కులం పేరును ప్రస్తావించినంత మాత్రాన దాని మీద అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టలేరని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.