పాములను చూస్తే మనమంతా ఆమడ దూరం పరిగెడతాం. అదే విషసర్పాలైతే అంతే సంగతి. కానీ కర్ణాటకకు చెందిన ఓ యువతి పాములను అలవోకగా పట్టుకొని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అలా పట్టుకున్న పాములను సురక్షితంగా అడవిలోకి విడిచిపెడుతోంది. వందకు పైగా విషసర్పాలను బంధించి..సెంచరీ కూడా కొట్టేసింది.
మంగళూరు, అశోక నగర్ ప్రాంతానికి చెందిన శరణ్య భట్.. ప్రస్తుతం బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతోంది. చుట్టుపక్కల ఎవరి ఇళ్లలో అయినా పాములు చొరబడ్డాయంటే.. వెంటనే తనకు పిలుపొస్తుంది. అక్కడకి వెళ్లిన శరణ్య తన టెక్నిక్‌తో పాములను సులభంగా బంధించేస్తుంది. ఇప్పటివరకు నాగుపాములు, కొండచిలువలు, నీటి పాములు సహా అనేక విషపూరితమైన పాములను పట్టుకొని కాపాడింది.
శరణ్య మాట్లాడుతూ.. పాములను సంరక్షించడం చాలా అవసరం. రోడ్లపైన చాలా పాములు చనిపోతుంటాయి. చిన్న పాములే కాదు ఎనిమిది, తొమ్మిది అడుగులు ఉన్న కొండచిలువలు కూడా వాహనాల కింద పడి చనిపోతుంటాయి. నాగుపామును చాలా మంది దైవంగా భావిస్తుంటారు. మిగిలిన పాముల మీద అలాంటి గౌరవం ఉండదు. అలాగని, ఇతర పాములు మంచివి కావు అనే భావన మనలో ఉండకూడదంటోంది. సంరక్షణ విషయానికి వస్తే అన్ని పాములు ముఖ్యమే అంటోంది ఈ అమ్మాయి. కాకుంటే అన్ని జాగ్రత్తలు తీసుకునే పాములు పడతానని చెబుతోంది శరణ్య.