ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుంది. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వారు ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. యువతలో కూడా ఈ సమస్య పెరిగిపోతుంది. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. కర్ణాటక మంత్రి, బీజేపీ నేత ఒకరు గుండెపోటుతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. ఆ వివరాలు.. సీఎం బసవరాజ్ బొమ్మై క్యాబినెట్‌లో అటవీ, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉమేశ్ కట్టీ మృతి చెందారు. బెంగళూరు డాలర్స్ కాలనీలో ఆయన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన మంగళవారం రాత్రి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పోందుతూ ఉమేశ్ కట్టీ మృతి చెందారు.
కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఇక ఉమేశ్ కట్టీకి భార్య సుశీల, కుమారుడు నిఖిల్, కుమార్తె స్నేహ ఉన్నారు. ఉత్తర కర్ణాటకకు రాష్ట్ర హోదా కోరుతున్న నేతల్లో కట్టీ కూడా ఒకరు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే మంత్రులు గోవింద్ కార్జోల్, సుధాకర్, బీజేపీ నేతలు ఆస్పత్రికి వచ్చి కట్టీ కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీకి చెందిన సిద్ధరామయ్య కూడా మంత్రి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం తెలిపారు.