ఇటీవల ఎక్కడ చూసినా లంచం లేనిదే ఏ చిన్న పని కూడా జరిగే పరిస్థితి లేదు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో చేతిలో లంచం పడనిదే.. పని ముందుకు జరగదు అన్న పరిస్థితులు ఏర్పడ్డాయని పలువురు బాధితులు అంటున్నారు.. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ లంచం తీసుకుంటు పట్టుబడ్డ అధికారుల గురించి వార్తలు చదువుతూనే ఉన్నాం.
లంచం ఇవ్వడం, తీసుకోవడం కూడా చట్టరీత్యా నేరం అని అందరికీ తెలుసు. కానీ సామాన్యులకు తమ పనులు కావాలంటే ప్రతి చోటా లంచం ఇవ్వాల్సిన దుస్థితి నెలకొంది. ఎక్కువగా లంచాలు ప్రభుత్వ పనులు చేయించుకోవడం కోసం ఇస్తుంటారని అంటారు.. కానీ ఇటీవల అన్ని రంగాల్లో లంచావతారులు పెరిగిపోయారు. రాజకీయ నేతలు.. వారి వద్ద పనిచేసేవారు.. కుటుంబ సభ్యులు సైతం ఈ మద్య లంచాలకు తెగబడుతున్నారు. తాజాగా ఓ బీజేపీ ఎమ్మెల్యే తనయుడు లంచం తీసుకుంటూ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి.. ఈ సమయంలో బీజేపీకి దిమ్మతిరిగే షాక్ ఒకటి తగిలింది. బీజేపీ ఎమ్మెల్యే తనయుడు ఓ కాంట్రాక్టర్ వద్ద రూ.40 లక్షలు తీసుకుంటూ లోకాయుక్తకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ విషయంపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దావణగెరే జిల్లా చన్నగిరి కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే విరూపాక్షప్ప మదల్ తనయుడు ప్రశాంత్ మదల్ బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్‌లో ప్రశాంత్ చీఫ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. విరూపాక్షప్ప కర్ణాటక సోప్స్ అండ్ డిటెర్జెంట్స్ లిమిటెడ్ చైర్మన్ వ్యవహరిస్తున్నాడు. తన తండ్రి కి సంబంధించిన పనులు కూడా చక్కదిద్దుతున్నాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి ప్రశాంత్ మదల్ లంచం డిమాండ్ చేశాడని.. వారం రోజుల క్రితం లాకాయుక్తను ఆశ్రయించాడు.
ఇటీవల అవినీతి కేసులను విచారించేందుకు కర్ణాటకలో కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థ ‘లాకాయుక్త’. సదరు కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రశాంత్ మదల్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే సబ్బులు తయారు చేసే కాంట్రాక్టర్ ప్రశాంత్ మదల్ కార్యాలయానికి రూ.40 లక్షలు తీసుకు వెళ్లి ఇచ్చారు. అదేసమయంలో లోకాయుక్త ఎమ్మేల్యే కొడుకు ప్రశాంత్ మదల్ రూ.40 లక్షలు లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్‌హాండెడ్‌గా పట్టుబడ్డాడు. అనంతరం అతని ఇంట్లో సోదాలు నిర్వహించగా భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. గత కొంత కాలంగా ప్రశాంత్ ప్రభుత్వానికి సంబంధించి ఏ పని చేయడానికైనా భారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు పలు ఫిర్యాదులు వచ్చినట్లు బాధితులు చెబుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా లోకాయుక్త అధికారులు మాట్లాడుతూ.. వాస్తవానికి కాంట్రాక్టర్ వద్ద ప్రశాంత్ డిమాండ్ చేసింది రూ.81 లక్షలు. ప్రస్తుతం అతను రూ.40 లక్షలు ఇచ్చినట్టుగా లోకాయుక్త తెలిపింది. గతంలో ప్రశాంత్ ఏసీబీలో ఫైనాన్షియల్ అడ్వైజర్ గా పనిచేశారు.. ప్రస్తుతం ఏసీబీ మూసివేసిన తర్వాత లోకాయుక్త ఏర్పాటైంది. కొంతకాలంగా లోకాయుక్తలో చేరేదుకు ప్రశాంత్ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. తన తండ్రి తరుపు నుంచి లంచం తీసుకుంటున్నట్లుగా భావిస్తున్నామని.. ఇంత డబ్బు ఎలా వచ్చిందన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. సోదాలు నిర్వహించిన అనంతం అతని ఇంట్లో లెక్కకు మించిన డబ్బు లభ్యమైందని.. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ ని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.