దేశంలోని అతి పెద్ద కార్పొరేట్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ , 44 వ వార్షిక సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. కోవిడ్ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్సింగ్, ఆడియో-విజువల్ మార్గాల ద్వారా జరిగిన ఈ మీటింగ్ లో దేశ వ్యాప్తంగా ఉన్న 3 కోట్ల మంది ఇన్వెస్టర్స్ ని ఉద్దేశించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. కరోనా కష్ట కాలంలో తమ సంస్థ ఉద్యోగుల సేవలను ఆయన కొనియాడారు. ఇక విధుల్లో ప్రాణాలు కోల్పయిన తమ ఉద్యోగులకి నివాళులు అర్పించారు.
ఇక ఈ సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ గ్రూప్స్ కి చెందిన ప్రముఖ టెలికాం దిగ్గజం జియో మరో సంచలన ప్రకటన చేసింది. ప్రపంచంలో అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ గా జియో గూగుల్ నెక్స్ట్ ఫోన్ ను ముఖేష్ అంబానీ ఆవిష్కరించారు. పోయిన ఏడాది గూగుల్ జియోలో రూ.33,737 కోట్ల పెట్టుబడి పెట్టింది. దీంతో.., ఇప్పుడు గూగుల్ భాగస్వామ్యంతో జియో.. ఈ జియో గూగుల్ నెక్స్ట్ ఫోన్ ప్రకటించింది. జియోఫోన్ నెక్ట్స్ ను సెప్టెంబర్ 10 గణేష్ చతుర్థి రోజున మార్కెట్లోకి తీసుకొనిరానున్నట్లు సంస్థ పేర్కొంది.
ఇక ఈ “జియో గూగుల్ నెక్స్ట్ ఫోన్” ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ ఉంటుంది. వాయిస్ అసిస్టెంట్, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ కెమెరా, లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ వంటి ఫీచర్స్ ఉండనున్నాయి. ఈ జియో గూగుల్ నెక్స్ట్ ఫోన్ ముందుగా భారతదేశంలో ప్రారంభించి.., తర్వాత ప్రపంచ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. కానీ.., దీని ధర ఎంత అనేది సంస్థ ఇంకా ప్రకటించకపోవడం విశేషం. దేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది 2జీ ఫోన్ నే వాడుతున్నారు. వారిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్ తీసుకొచ్చినట్లు జియో సంస్థ తెలియచేసింది. ఇక ఈ జియో గూగుల్ నెక్స్ట్ ఫోన్ ప్రకటనపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా తన అందాన్ని తెలియచేస్తూ ట్వీట్ చేయడం విశేషం.