మనలో చాలా మందికి.. జీవితంలో మంచి పొజిషన్‌లో సెటిల్ అవ్వాలనే ఆశ ఉంటుంది. కానీ ఆ మేరకు ప్రయత్నాలు చేసేవారు కొందరు మాత్రమే ఉంటారు. చాలామంది దేని గురించి అయినా చెబితే.. ఆ మావల్ల ఏమవుతుంది.. మేం చేయలేం.. నాకు ఎన్నో సమస్యలు.. ఎవరు సపోర్ట్ చేయరు.. చాలా అలసిపోతున్నాను ఇలా రకరకాల కారణాలు చేబుతారు. కానీ కార్యశీలులు మాత్రం.. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎన్ని ఇబ్బందులు ఎదురయిన తాము అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఆఖరికి అంగవైకల్యం ఉన్నా సరే వారికి అడ్డు కాదు. దాన్ని అధిగమించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఇందుకు ఎందరో నిదర్శనంగా నిలిచారు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ వ్యక్తి సాధించిన విజయం ఎందరికో స్ఫూర్తినిస్తోంది. ఆ వివరాలు..
సర్వేంద్రియాం నయనం ప్రధానం అన్నారు.. మనకు ఉన్న అని జ్ఞానేంద్రియాల్లో కళ్లు ఎంతో ముఖ్యం. అవి లేకపోతే.. ఇక జీవితమంత చీకటే. మరి ఇల అంధత్వం ఉన్నవారు.. తమ పనులు తాము చేసుకోలేరు.. ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వ్యక్తి.. ఇందుకు భిన్నం. 11 ఏళ్ల వయసులోనే కంటి చూపు కోల్పోయిన అతడు.. దాన్ని అవరోధంగా భావించలేదు. ఆత్మవిశ్వాసంతో.. బాగా చదువుకున్నాడు. అక్కడితో ఆగలేదు.. ఏకంగా మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలో ఏడాదికి 51 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం పొందాడు.
జార్ఖండ్, ఛత్రా జిల్లాలోని తాండ్వా బ్లాక్‌లోని చట్టిగాడిలాంగ్ గ్రామానికి చెందిన సౌరభ్ ప్రసాద్ చిన్నతనం నుంచి గ్లాకోమా అనే వ్యాధి కారణంగా తన చూపును కోల్పోయాడు. 11 ఏళ్లకే అంధుడయ్యాడు. చూపు కోల్పోయాడు కానీ.. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో జీవితంలో ముందుకు సాగాడు.
సౌరభ్ తండ్రి ఓ టీచర్, తల్లి గృహిణి. వారి ప్రోత్సాహంతో చదువులో రాణించాడు. పదో తరగతి, ఇంటర్‌లో మంచి మార్కులు సాధించాడు. తర్వాత ఐఐటీ ఢిల్లీలో చేరి.. ప్రస్తుతం సీఎస్ఈ మూడో సంవత్సరం చదువుతున్నాడు. దానితో పాటే.. సౌరభ్ మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఆ కంపెనీ నుంచి రూ.51 లక్షల ప్యాకేజీతో జాబ్ ఆఫర్‌ను కొట్టేశాడు.
ఈ సందర్భంగా సౌరభ్ మాట్లాడుతూ.. నాకున్న వైకల్యం గురించి నేను ఏ రోజు భయపడలేదు. కుంగిపోలేదు. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ముందుకెళ్లాను. నేను సాధించిన ఈ విజయానికి తన తల్లిదండ్రులే కారణం అని తెలిపాడు. సౌరభ్ సాధించిన విజయంపై చాలా మంది అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.