ఝార్ఖండ్‌లోని జంశెద్‌పుర్‌లో సహచర ఖైదీ హత్య కేసులో 15 మంది ఖైదీలకు మరణశిక్ష విధిస్తూ.. అక్కడి న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. మరో ఏడుగురికి పది సంవత్సరాలు జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే..
2019లో ఝార్ఖండ్ జంశెద్‌పుర్‌లో ఘాఘీడీహ్ సెంట్రల్ జైలులో రెండు గ్రూపుల ఘర్షణలు చోటు చేసుకుంది. ఆ సమయంలో ఇద్దరు ఖైదీలు తీవ్రగాయాల పాలయ్యారు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మనోజ్‌కుమార్ సింగ్ అనే ఖైదీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పర్సుదిహ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ఈస్ట్ సింగ్భుమ్‌లోని అదనపు జిల్లా కోర్టు జడ్జి రాజేంద్ర కుమార్ సిన్హా గురువారం సంచలన తీర్పు ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది.
నింధితులకు ఐపీసీ సెక్షన్లు 302, 120బి కింద 15మందికి ఉరిశిక్ష విధించగా.. ఇక సెక్షన్ 307 అభియోగాల కింద మరో ఏడుగురికి పదేళ్ల పాటు జైలు శిక్షను విధించారు. ఇదిలా ఉంటే.. మరణ శిక్ష పడిన వారిలో ఇద్దరు ఖైదీలు పరారీలో ఉన్నారు. వెంటనే వారిని పట్టుకొని తమ ఎదుట హాజరు పరచాలని డీజీపీని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పారిపోయిన ఇద్దరు ఖైదీలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.