ఇటీవల దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు పడ్డాయి. ఓ వైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా.. పలు ప్రాంతాల్లో వడగండ్లతో కూడిన వర్షాలు పడుతున్నాయి. బెంగుళూరు సిటీని వర్షాలు ముంచేశాయి. ఈ మద్య పడ్డ వర్షాలకు ఇక్కడ ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. పలు షాపుల్లోకి నీరు చేరి భారీ నష్టాన్ని మిగిల్చాయి.
ఇటీవల వాతావరణంలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి.. చలికాలంలో కూడా విపరీతమైన వానలు కురవడం, వేసవికాలంలో కూడా భారీ వర్షాలు రావడం చూస్తున్నాం. అకాల వర్షాలకు రైతుల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. రోడ్లు మొత్తం కొట్టుకు పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా కొన్నిచోట్ల ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడ్డ విషయం తెలిసిందే.. దీంతో తడిసిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఇలా ఎడతెరిపి లేని వానలకు ఓ షాపులోకి వరద నీరు రావడంతో వ్యాపారి కన్నీటిపర్యంతమయ్యారు. అతనికి జరిగిన నష్టమేంటి? అతని కన్నీరుకు కారణం ఏంటో తెలుసుకుందాం. వివరాలలోకి వెళితే..
కర్ణాటక.. బెంగుళూరులో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు నగరంలోని కాలువలన్నీ పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై భారీగా వరదనీరు ప్రవహించడంతో పక్కనే ఉన్న పలు షాపుల్లోకి నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో వరద నీరు నిహాన్ జ్యూవెల్లరీ అనే నగల షాపులోకి ప్రవేశించాయి. వరద నీటితో నగల షాపులో ఉన్న రూ.2కోట్ల విలువైన నగలు కొట్టుకుపోయాయని షాపు యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. చెత్త చెదారంతో కూడిన వరద ధాటికి షాపును మూసివేయలేకపోయామని షాపు యజమాని చెప్పారు. దుకాణంలో బంగారం ఆభరణాలు వరదకు తడిసిపోయాయని, మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించినా వారు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. షాపులో ఉన్న 80 శాతం నగలు అంటే రూ.2కోట్ల నగలు మురికినీటిలో కొట్టుకుపోయాయని షాపు యజమాని ప్రియ కన్నీటిపర్యంతమయ్యారు.
దుకాణాలే కాకుండా చాలా ఇళ్ళు కూడా ముంపుకు గురైనాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీరు కారణంగా బెంగుళూరు లో నిన్న విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులో ఇన్‌ఫోసిస్ సంస్థలో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీరు వర్క్ చేస్తున్న ఆంధ్ర యువతి భానురేఖ మృతి చెందారు. బెంగళూరు వీధుల్లో కారులో ప్రయాణిస్తుండగా కెఆర్ సర్కిల్ వద్ద అండర్ పాస్‌లోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరింది.. ఆ లోతు తెలియక డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు.. అంతే కారు లోకి భారీగా నీరు చేరడంతో అందులో ఉన్నవాళ్లు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. స్థానికులు వారిని బయటకు తీసినా..చికిత్స పొందుతూ భానురేఖ కన్నుమూసింది. ఈ వరద బీభత్సంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.