బిస్లరీ భారత్ లో పాపులర్ వాటర్ బాటిల్ బ్రాండ్. దేశంలో ప్రతీ పల్లెనూ ఈ బిస్లరీ బ్రాండ్ పలకరించింది. ఏ షాప్ కి వెళ్లినా ‘అన్నా బిస్లరీ బాటిల్ ఉందా’ అని అడిగేంతగా ఈ బ్రాండ్ కస్టమర్లను ఆకర్షించింది. బిస్లరీ బ్రాండ్ ని ఇమిటేట్ చేయాలని చాలా కంపెనీలు ప్రయత్నించి చేతులు కాల్చుకున్నాయి. బిస్లరీ కంపెనీలా తాము కూడా మార్కెట్ లో టాప్ లో ఉండాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. గత కొన్ని దశాబ్దాలుగా బిస్లరీ నంబర్ వన్ స్థానంలో నిలుస్తూ వచ్చింది. అంతటి ఘన చరిత్ర ఉన్న బిస్లరీ బ్రాండ్ ఇవాళ టాటా చేతుల్లోకి వెళ్ళిపోతుంది. 7 వేల కోట్లకు బిస్లరీ కంపెనీని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సొంతం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇవాళ బిస్లరీ కంపెనీ టాటా చేతుల్లోకి వెళ్లిపోతుండడం వెనుక ఒక మహిళ ఉంది. ఆమె పేరు జయంతి చౌహాన్. ఈమె ఎవరో తెలుసుకునేముందు బిస్లరీ వ్యవస్థాపకుడు గురించి తెలుసుకోవాలి.
చిన్న నీటి బిందువులా పుట్టిన బిస్లరీ ఇవాళ ఒక మహా సముద్రంలా ఎదగడానికి ప్రధాన కారణం రమేష్ చౌహన్. ఈయన 1940లో జన్మించారు. ప్యాకేజ్డ్ వాటర్ వ్యాపారాన్ని 50 ఏళ్లకు పైగా విజయవంతంగా నడిపారు. ఈ బ్రాండ్ ఇంతలా సక్సెస్ అయ్యిందంటే దానికి రమేష్ చౌహాన్ అనే వ్యక్తి శ్రమ, కృషి ఎంతగానో ఉంది. థమ్సప్, గోల్డ్ స్పాట్, లింకా వంటి పాపులర్ సాఫ్ట్ డ్రింకుల సక్సెస్ వెనుక కూడా ఈయన కృషి ఉంది. ఈ సాఫ్ట్ డ్రింకుల సృష్టికర్త, మార్కెటింగ్ పర్సన్ ఈయనే. ఆ తర్వాత భారీ లాభాలకు కోకాకోలా వంటి మల్టీనేషనల్ కంపెనీలకు అమ్మారు. 2020లో బిస్లరీ వార్షిక ఆదాయం 100 కోట్లు, 2021లో 95 కోట్లు ఉండగా.. ఈ ఏడాది 220 కోట్ల టర్నోవర్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. బిస్లరీ కంపెనీ బాగానే నడుస్తున్నా.. ఎందుకు రమేష్ చౌహాన్ అమ్మేయాలని నిర్ణయించుకున్నారు? ఎంతో ఇష్టపడి.. కష్టపడి నిర్మించుకున్న బిస్లరీ సామ్రాజ్యం ఇవాళా టాటా చేతుల్లోకి వెళ్లిపోతుండడం వెనుక కారణం ఎవరు? అంటే దానికి సమాధానమే జయంతి చౌహాన్.
జయంతి చౌహన్.. రమేష్ చౌహన్ కూతురు. ఈమె ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోర్సులో గ్రాడ్యుయేట్ చేసింది. ఈమె లాస్ ఏంజెల్స్ లో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైనింగ్ అండ్ మర్చండైజింగ్ కోర్సు కూడా చేసింది. ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ స్టైలింగ్ కోర్సు కూడా నేర్చుకుంది. దుస్తులకు స్టైలింగ్ కూడా చేసింది. ప్రస్తుతం బిస్లరీ కంపెనీకి వైస్ చైర్మన్ గా ఉంది. 24 ఏళ్ల వయసులో బిస్లరీ కంపెనీలో అడుగుపెట్టింది. ఇప్పుడు ఆమెకు 37 ఏళ్ళు. అయితే బిస్లరీ కంపెనీని తండ్రి తరువాత ముందుకు నడిపించే ఆసక్తి తనకు లేదని తండ్రికి చెప్పింది. ఈ విషయం ఆమె తండ్రి మీడియా ముఖంగా వెల్లడించారు. ఈ బ్రాండ్ ని తన తర్వాత ముందుకు తీసుకెళ్లేవారు లేరని.. బిస్లరీ బిజినెస్ పట్ల ఆమెకు ఏ మాత్రం ఆసక్తి లేదని, అందుకే అమ్మేస్తున్నట్లు వెల్లడించారు.
ఒప్పందం ప్రకారం రెండేళ్ల పాటు కంపెనీ కార్యకలాపాలు సాగించి.. ఆ తర్వాత కంపెనీని కొన్న వారికి అప్పగిస్తామని అన్నారు. అయితే కంపెనీలో మైనారిటీ వాటా కూడా ఉంచుకోనని.. తనకొచ్చిన డబ్బుని వాటర్ హార్వెస్టింగ్, ప్లాస్టిక్ రీసైక్లింగ్, ఛారిటీ కోసం వినియోగిస్తానని అన్నారు. అదన్నమాట విషయం.. చిన్న చిన్న జీవితాలు గడిపే మధ్యతరగతోళ్ళకి పెద్ద పెద్ద ఆలోచనలు వస్తాయి కానీ పెట్టుబడికి డబ్బులుండవు. కనీసం బిస్లరీ లాంటి కంపెనీలో జాబ్ వస్తే చేయాలని అనుకుంటారు. కావాలి అనుకున్నవారికి దొరకదు, వద్దు అనుకున్నవారిని వదలదు. అదే విధి. ఏమీ లేనివాళ్లు అవకాశాలు లేక ఏడుస్తుంటే.. అన్నీ ఉన్నవాళ్లు ఇంట్రస్ట్ లేదని వదిలేస్తున్నారు.
7 వేల కోట్ల రూపాయల బిజినెస్ కేవలం ఇంట్రస్ట్ లేదన్న ఒకే ఒక్క కారణంతో టాటా చేతుల్లోకి వెళ్లిపోతుంది. బిస్లరీ కంపెనీ ఓనర్ కారుకి క్లీనర్ గా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు జనం. అలాంటి బిస్లరీ కంపెనీకి ఓనర్ అవ్వమంటే ఇంట్రస్ట్ లేదని జయంతి చౌహాన్ అనడం నిజంగా ఆశ్చర్యమే. సినిమాల్లో కంపెనీని ఎలా లాక్కోవాలా అని కుట్రలు పన్నుతారు. అలాంటిది ఇన్ని లాభాలు తెచ్చిపెట్టే కంపెనీ పట్ల గానీ, కంపెనీ తెచ్చే కరెన్సీ కట్టలు మీద గానీ వ్యామోహం లేదంటే గొప్ప విషయమే. ఏది ఏమైనా గానీ బిస్లరీ మంచి కంపెనీ చేతుల్లోకే వెళ్తుంది.