కన్నవారు, బంధాలు, బాంధవ్యాలు వంటి పదాలకు ఇవాళ్టి రోజుల్లో చాలా మందికి అర్థం తెలీదని గట్టిగానే చెప్పొచ్చు. అందుకు ఉదాహరణగా మన కళ్ల ముందు ఎన్నో వృద్ధాశ్రమాలు సాక్షాలుగా నిలుస్తాయి. కొందరికి అక్కడదాకా తీసుకెళ్లే సమయం కూడా లేక కన్నవారిని రోడ్లపైనే వదిలేస్తున్నారు. పండు వయసులో రోడ్లపై బిచ్చమెత్తుకుంటూ, ఫుట్‌పాత్‌లపై పడుకునే ముసలివాళ్లను చాలా మందినే చూసుంటారు.
ఆ కోవకే చెందుతుందేమో ఈ పిచ్చితల్లి. నడుం ఒంగిపోయి నడవడానికి కూడా ఓపికలేని ముసలావిడ ఓ దుకాణం ఎదుట నిద్రపోతూ ఉంది. అప్పుడే దుకాణం తెరవడానికి వచ్చిన యజమాని, ఆమెపై కేకలేశాడు లేవలేదు. కాలుతో తన్నినా లేవలేదు. ఇక, ఆగ్రహానికి గురైన యజమాని చేతిలోని బాటిల్‌తో వృద్ధురాలిపై నీళ్లు పోసిమరీ లేపాడు. లేవగానే భయాందోళనతో ఆ వృద్ధురాలు యజమాని కాళ్లు మొక్కింది.
ఆవేశంతో దుకాణం యజమాని కేకలేస్తూనే ఉన్నాడు. అటుగా వెళ్తున్న జవాను వెంటనే యజమానిని వారించి, పక్కకు తోసేశాడు. మాట వినని యజమాని కాలర్ పట్టుకుని కాస్త గట్టిగానే బుద్ధి చెప్పాడు. వెంటనే జవాను వృద్ధురాలిని అక్కడి నుంచి లేపి.. ఆమె సంచి, చెప్పులు తీసుకుని పక్కకు తీసుకొచ్చాడు. వృద్ధురాలి తల, చీర సర్ది, చెప్పులు కాళ్ల దగ్గర పెట్టి వేసుకోమని సూచించాడు. జవాను ముసలావిడకు కొంత డబ్బు కూడా ఇచ్చాడు. ఆగస్టు 11న సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు జవాను ఔధార్యానికి ఫిదా అయిపోయారు. ‘పరిచయం లేని ప్రాణానికి రక్షణిచ్చే ఓకే ఒక వ్యక్తి జవాను’ అంటూ కితాబిస్తున్నారు. ఈ ఘటనపై మీ స్పందనను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.
A big salute to the uniform 🇮🇳pic.twitter.com/VZ6b601nPC
— Praveen Angusamy, IFS 🐾 (@PraveenIFShere) August 19, 2021