పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వాసుపత్రిలో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ అప్పడప్పుడు కొన్ని నిర్లక్ష్య ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేక దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు పేద ప్రజలు. ముఖ్యంగా అంబులెన్స్ విషయంలో ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో ఓ నిండు ప్రాణం పోయింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలాలాబాద్ పట్టణానికి చెందిన బీనాదేవి (65) బుధవారం ఉదయం విపరీతమైన కడుపునొప్పి తల్లడిల్లిపోయింది. వెంటనే ఆమె తనయుడు అంబులెన్స్ కోసం ఫోన్ చేసినప్పటికీ అక్కడ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇక లాభం లేదనుకున్న బీనాదేవి తనయుడు దినేశ్ తోపుడుబండిపై పడుకోబెట్టి, నాలుగు కిలోమీటర్ల దూరంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పరుగు తీశాడు. బీనాదేవిని పరీక్షించిన వైద్యుడు అప్పటికే ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు.
సకాలంలో అంబులెన్స్ వచ్చి ఉంటే తన తల్లి బతికి ఉండేదని దినేశ్ కన్నీరు పెట్టుకున్నాడు. తిరిగి అదే తోపుడు బండిపై తల్లి మృతదేహంతో దినేశ్ ఇంటిముఖం పట్టాడు. ఈ సంఘటన చూసిన స్థానికులు చలించిపోయారు. తల్లిని తోపుడు బండిపై తీసుకు వస్తున్న ఘటనకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంబులెన్స్ విషయంలో నిర్లక్ష్య వైఖరి వహిస్తే ఇలా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని..ప్రభుత్వం ఇలాంటి ఘటనపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.