పోలీసులు లంచం కోసం సామాన్యులను పీడిస్తారని కొందరి అభిప్రాయం. మరి ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు అయితే టార్గెట్ పెట్టుకుని మరి వాహనాదారుల నుంచి లంచాలు వసూలు చేస్తుంటారని ప్రచారం కూడా ఉంది. ప్రజల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన సందర్భాల్లో అధికారులే స్వయంగా మారువేషంలో తనిఖీలు చేస్తుంటారు. ఈ క్రమంలో సిబ్బంది చేసేది తప్పు అని తెేలితే.. వారిపై చర్యలను కూడా తీసుకుంటారు. తాజాగా రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన రాజేంద్రప్రసాద్ అనే కానిస్టేబుల్ అలా సామాన్యులను లంచం అడిగేవాడు. ఈక్రమంలో అతడు సాక్షాత్తు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నే లంచం అడిగి సస్పెండ్ అయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్ లోని జైపూర్ నార్త్ జోన్ కి పరీష్ దేశ్ ముఖ్ డీసీపీగా పనిచేస్తున్నారు. అయితే అక్కడ కొందరు ట్రాఫిక్ పోలీసులు లంచాలు అడుగుతున్నారని పరీష్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన స్వయంగా క్షేత్ర స్థాయిలోకి వెళ్లి వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి సివిల్ డ్రెస్ లో జైపూర్ నగరంలో తిరుగుతున్నారు. ఆయన వాహనంపై ఎలాంటి పోలీస్ గుర్తులు కూడా ఉంచలేదు. ఆయనతో పాటు ఉన్న గన్ మన్, డ్రైవర్ కూడా సాధారణ దుస్తుల్లోనే ఉన్నారు. డీసీపీ పరీష్ దేశ్ ముఖ్ ప్రయాణిస్తున్న వాహనం ట్రాన్స్ పోర్ట్ నగర్ ప్రాంతంలోని రోటరీ సర్కిల్ వద్దకు వచ్చింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న రాజేంద్ర ప్రసాద్ అనే కానిస్టేబుల్ డీసీపీ వాహనాన్ని ఆపేశాడు. సీట్ బెల్ట్ పెట్టుకోలేందంటూ వారిని చలాన్ కట్టమన్నాడు.
చలాన్ అయితే ఎక్కువ మొత్తంలో కట్టాల్సి వస్తుంది కాబట్టి రూ.500 లంచం ఇస్తే చలాన్ రాయనని చెప్పాడు. ఆ తరువాత కారులో ఉంది డీసీపీ అని తెలుసుకుని తెల్లముఖం వేశాడు. అయితే అప్పటికి జరగాల్సిన నష్టం జరిగింది. ఈ విషయాన్ని డీసీపీ వెంటనే తన పై అధికారులకు నివేదించారు. డీసీపీ ఇచ్చిన సమాచారం ఆధారంగా కానిస్టేబుల్ రాజేంద్రప్రసాద్ ను వెంటనే సస్పెండ్ చేశారు. పోలీస్ అధికారులు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో పోలీసుల పనితీరు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకు చేపట్టిన డెకాయ్ ఆపరేషన్ అని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఇందులో కానిస్టేబుల్ రాజేంద్ర ప్రసాద్ అడ్డంగా దొరికిపోయాడని వెల్లడించారు. అయితే ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.