ఇండియాలో కలకలం రేపుతున్న వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌పై సొంతదేశంలో విచారణ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సాఫ్ట్‌వేర్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ఇజ్రాయిల్ రక్షణ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న సాఫ్ట్‌వేర్. ఇండియా సహా పలుదేశాలు ఈ స్పైవేర్ సాఫ్ట్‌వేర్‌ను ప్రత్యర్ధులు, జర్నలిస్టులపై నిఘా కోసం ఉపయోగిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇండియాలో పెగసస్ రేపిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో పెగసస్ స్నూపింగ్ స్కామ్ విషయమై ఎన్ఎస్ఓ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై ఇజ్రాయిల్ రక్షణ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. పెగసస్ స్పైవేర్ వ్యవహారాన్ని వ్యక్తిగత గోప్యత అంశంగా తాను చూడడం లేదని, దీనిని దేశద్రోహంగా చూడాలని రాహుల్ అన్నారు. భారతదేశంపైనా, దేశ ప్రజలపైనా పెగసస్ అనే ఆయుధాన్ని ప్రధాని వాడారని ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఉగ్రవాదులపై వాడాల్సిన ఆయుధాలని ప్రజాస్వామ్య వ్యవస్థలపై ఎలా ప్రయోగిస్తారని రాహుల్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యమే ఆందోళనలో పడేలా కేంద్రం వ్యవహరిస్తోందని, అందుకే దీనిపై చర్చ జరగాల్సిందేనని డీఎంకే నేత టి.ఆర్. బాలు అన్నారు.
పెగసస్ స్పైవేర్, రైతు సమస్యల అంశంలో విపక్ష పార్టీల సభ్యులు పార్లమెంటు పరువు తీసేలా ప్రవర్తిస్తున్నారని బీజేపీ ఎదురు దాడికి దిగింది. ఎన్ఎస్ఓ గ్రూప్ కార్యాలయంలో తాజాగా తనిఖీలు నిర్వహించినట్టు ఇజ్రాయిల్ రక్షణ శాఖ వెల్లడించింది.