దేశంలో ఎంతో మంది రిక్షా కార్మికులు ఉదయం లేచిన మొదలు సాయంత్రం వరకు కష్టపడితే వచ్చే డబ్బుతో ఇల్లు గడవడమే ఎంతో కష్టం. అలాంటి ఓ రిక్షా కార్మికుడికి ఆదాయపన్ను శాఖ (ఐటీ) రూ.3 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసును చూసిన రిక్షా కార్మికుడు దిమ్మతిరిగే షాక్ తగిలింది. దీంతో పోలీసులు ఆశ్రయించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో జరిగింది.
మధుర జిల్లాలోని బకాల్‌పూర్‌కు చెందిన ప్రతాప్ సింగ్ ఓ రిక్షా కార్మికుడు. బ్యాంక్ అధికారులు పాన్ కార్డును అకౌంట్‌కు అనుసంధానించాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 15న బకాల్‌పూర్‌లోని జన్ సువిధ కేంద్రంలో పాన్ కార్డు కోసం అప్లయ్ చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ రిక్షా కార్మికుడికి సంజయ్ సింగ్ అనే వ్యక్తి పిలిచి పాన్ కార్డు అంటూ ఓ కలర్ కాపీ ఇచ్చాడు. అయితే ఆ రిక్షా కార్మికుడికి చదువు రాదు.. అదే పాన్ కార్డు అనుకొని తీసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ నెల 19న రూ.3,47,54,896 చెల్లించాలని ఐటీ అధికారులు ప్రకాశ్ సింగ్‌కు నోటీసులు జారీచేశారు.
తన జీఎస్టీ నంబర్‌తో 2018-19లో రూ.43,44,36,201 మేర వ్యాపారం చేసినందుకుగాను ఈ మొత్తాన్ని చెల్లించాలని అందులో పేర్కొన్నారు. దాంతో ఆ రిక్షా వాలాకు ఏమీ అర్థం కాలేదు.. రెక్కాడితే కానీ డొక్కాడని తనకు ఇలాంటి నోటీసు రావడం లేంటీ అని ఆశ్చర్యపోయాడు. తాను రిక్షా కార్మికుడినని తన పాన్ కార్డును మరెవరో దుర్వినియోగం చేశారని ఎఫ్‌ఐఆర్ నమోదుచేయాలని ఐటీ అధికారులు సలహా ఇచ్చారు. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ప్రతాప్ సింగ్ మధుర పోలీసులో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.