ప్రస్తుతం సోషల్ మీడియాలో జాతీయ భాష అంశం మీద వాడీవేడి చర్చ జరుగుతుంది. హిందీ జాతీయ భాష కాదంటూ.. కిచ్చ సుదీప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఈ క్రమంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్, హీరో సుదీప్‌కు కౌంటర్ ఇచ్చారు. ‘హిందీ జాతీయ భాష కాకపోతే మీ సినిమాలను హిందీలో డబ్ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు. హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృ భాషే, జాతీయ భాషే, జనగణమన’ అంటూ సుదీప్‌ను ప్రశ్నించాడు. వీరిద్దరి ట్వీట్స్ వల్ల సోషల్ మీడియాలో నెటిజనులు రెండు వర్గాలుగా చీలి.. జాతీయ భాష అంశం మీద జోరుగా చర్చించుకుంటున్నారు.
నిజానికి హిందీని జాతీయభాషగా మార్చే ప్రయత్నం ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది. కానీ దక్షిణాది రాష్ట్రాలు అందుకు ససేమీరా అంటున్నాయి. బలవంతంగా హిందీని నేర్చుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నాయి. ఈ క్రమంలో అసలు భారతదేశానికి జాతీయ భాష అంటూ ప్రత్యేకంగా ఏదైనా భాష ఉందా? రాజ్యాంగంలో దీని గురించి ఎక్కడైనా ప్రస్తావించారా? కోర్టులు జాతీయ భాష అంశంపై ఏవైనా తీర్పులు వెల్లడించాయా? వంటి తదితర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: Tweet War: హిందీ భాషపై.. అజయ్ దేవగన్, కిచ్చా సుదీప్ మధ్య ట్వీట్ల వార్!
భారతదేశానికి జాతీయ భాష ఉందా?
నిజానికి.. ‘జాతీయ భాష హిందీ’ అనే ప్రతిపాదన, దాని మీద వివాదం ఇప్పటిది కాదు. స్వాతంత్య్రానికి ముందు నుంచే ఈ అంశం తరచుగా తీవ్ర వివాదాలకు కారణమవుతోంది. రాజ్యాంగం ప్రకారం భారతదేశానికి ఒక జాతీయ భాష అనేది లేదు. జాతీయ స్థాయిలో అధికార భాషలుగా హిందీ, ఇంగ్లిష్‌లు కొనసాగుతున్నాయి. వీటితో పాటు.. రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూలులో చేర్చిన 22 భాషలకు కూడా అధికార భాషల హోదా ఉంది. కాబట్టి.. హిందీ నేషనల్ లాంగ్వేజ్ అనే వాదన ముమ్మాటీకి తప్పే. కాకుంటే.. దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ కాబట్టి, హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి.. హిందీకి ఇంతటి ఆదరణ ఉంది.
జాతీయ భాష, అధికారిక భాష అంటే ఏమిటి?
జాతీయ పతాకం, జాతీయ జంతువు తరహాలో భారతదేశానికి, సంస్కృతికి ఒక చిహ్నంగా ఉండే భాష. ఒక భాషను ఒక దేశానికి జాతీయ భాషగా ప్రకటించటం అంటే.. ఆ దేశానికి చెందిన ప్రజలందరూ ఆ భాషా సంస్కృతులకు చెందిన వారనే సందేశాన్ని ప్రపంచానికి చాటడమేనని చెప్పొచ్చు. అదే అధికార భాష అంటే.. ఆ దేశ లేదా రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో, పాలన, అధికార యంత్రాంగం సమాచార మార్పిడిలో మిగతా రాష్ట్రాలతో సంప్రదింపుల్లో ఉపయోగించే భాష. పార్లమెంటు, అసెంబ్లీ సహా చట్టసభల చర్చల్లో, కోర్టు విచారణల్లో ఉపయోగించే భాష.
జాతీయోద్యమం.. హిందీ ప్రచారం
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశంలో మొదలైన జాతీయోద్యమంలో భాగంగా.. ‘ఒక దేశం, ఒక భాష, ఒక సంస్కృతి’ అనే భావనను కూడా కొందరు నాయకులు బలపరుస్తూ వచ్చారు. ఆ క్రమంలో హిందీ మాట్లాడని దక్షిణాది రాష్ట్రాలను – హిందీ మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాలను సమైక్యం చేసే ఉద్దేశంతో మహాత్మా గాంధీ స్వాతంత్య్రానికి మూడు, నాలుగు దశాబ్దాలు ముందుగానే దక్షిణాదిన హిందీ ఉద్యమం ప్రారంభించారు. కానీ దీనిపై అప్పట్లోనే వ్యతిరేకత వ్యక్తం అయ్యింది.
1937, 1965లో హిందీ వ్యతిరేక ఉద్యమం..
1937లో నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని పాఠశాలల్లో హిందీ బోధనను తప్పనిసరి చేస్తూ అప్పటి కాంగ్రెస్ సారథ్యంలోని సి.రాజగోపాలాచారి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీనిని.. ద్రవిడ ఉద్యమ నాయకుడు పెరియార్ ఇ.వి.రామస్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. నాటి జస్టిస్ పార్టీ సారథ్యంలో ప్రజలు ఉద్యమించారు. దాదాపు మూడేళ్ల పాటు ఈ ఉద్యమం సాగింది. ఆ తర్వాత 1940 ఫిబ్రవరిలో నాటి మద్రాస్ బ్రిటిష్ గవర్నర్ హిందీ తప్పనిసరి బోధన ఉత్తర్వులను రద్దు చేశారు. 1965లో కూడా హిందీ వ్యతిరేక ఉద్యమం వచ్చింది.
హిందీ జాతీయ భాష కాదంటూ వివిధ కోర్టుల్లో తీర్పులు..
హిందీ జాతీయ భాష అనే వివాదం మీద గతంలో కోర్టులు పలుమార్లు తీర్పులు వెల్లడించాయి. భారతదేశానికి అధికార భాషలు మాత్రమే ఉన్నాయి కానీ.., జాతీయ భాష అంటూ ఏది లేదని స్పష్టం చేశాయి. వాటిల్లో 2010లో గుజరాత్ అహ్మదాబాద్ కోర్టు తీర్పు ఒకటి.
కచ్చాడియా అనే వ్యక్తి.. దేశంలోని కంపెనీలు అన్నీ తమ ఉత్పత్తులకు సంబంధించిన వివరాలు అనగా.. ధర, పదార్థాలు, ఎప్పుడు తయారు చేశారు వంటి వివరాలను జాతీయ భాష అయిన హిందీలో ముద్రించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాలని పిల్ వేశాడు. దీన్ని విచారించిన గుజరాత్ హైకోర్టు.. మన దేశంలో ఎక్కువ మంది హిందీ మాట్లాడుతుండోచ్చు. కానీ.. భారత రాజ్యాంగం దేశంలోని ఏ భాషకు జాతీయ భాష హోదా ఇవ్వలేదు. కేవలం అధికార భాషలు మాత్రమే ఉన్నాయి. అంతేకాక హిందీ ఎంతమాత్రం జాతీయ భాష కాదు అని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: బాలీవుడ్ సినిమాలపై కిచ్చా సుదీప్ షాకింగ్ కామెంట్స్!
తాజాగా 2022, ఫిబ్రవరిలో ఓ కేసు సందర్భంగా బాంబే కోర్టు హిందీని జాతీయ భాషగా పేర్కొంటు తెలంగాణకు చెందిన వ్యక్తి బెయిల్ పిటిషన్‌ను రద్దు చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషనర్.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన తీర్పు వెల్లడించాల్సి ఉంది.
స్వాతంత్య్రం తర్వాత దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీ భాషను జాతీయ భాషగా చేయాలన్న ప్రతిపాదనల మీద ఎప్పటి నుంచో వాడివేడిగా చర్చ జరుగుతూనే ఉంది. హిందీ ఏకైక జాతీయ భాషగా ఉంటే.. దానివల్ల హిందీ రాని ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నది ప్రధాన అభ్యంతరం. ఇక తమది కాని భాషను తమపై బలవంతంగా రుద్దటం ఏమిటనేది రెండో అభ్యంతరం. అయితే అఖిల భారత స్థాయిలో ఎంపికలు జరిగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీ వాళ్ళకు ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనీ, దీనికి కారణం అనేక రకాల పరీక్షలను కేవలం ఇంగ్లీషు, హిందీల్లో మాత్రమే పెడుతుండటమే అనే ఆరోపణ ఎప్పటినుంచో ఉంది. కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు దేశవ్యాప్తంగా ఉన్నవైనప్పటికీ వాటిలో ఉద్యోగాలకైతే ఆంగ్లంతోపాటు హిందీ కూడా రావడం తప్పనిసరి చేశారు. దీంతో అలాంటి సంస్థల్లోనైతే అత్యధిక శాతం ఉద్యోగాలు కేవలం హిందీ వాళ్ళకే దక్కుతున్నాయని హిందీయేతర భారతీయులు.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఈ పద్ధతి మారాలని సామాజిక మాధ్యమాల్లో యువత తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: KGF లో వేల మంది చనిపోయారు! షాకింగ్ సీక్రెట్స్ చెప్పిన రియల్ KGF మైనింగ్ ఇంజినీర్
ఇక తాజా వివాదంలో.. అజయ్‌దేవ్‌గణ్ చేసిన వ్యాఖ్యలను నెటిజనులు తప్పుపడుతున్నారు. రాజ్యాంగం ప్రకారం భారతదేశానికి జాతీయ భాష అంటూ ఏది లేదు. ఈ మాత్రం విషయం పరిజ్ఞానం లేకుండానే.. మాతృ భాష, జాతీయ భాష అంటూ ట్వీట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇంత చిన్న విషయం తెలియకపోవడం ఏంటని మండిపడుతున్నారు. మరి కేవలం అధికార భాష హోదా మాత్రమే ఉన్న హిందీని జాతీయ భాషగా ప్రచారం చేస్తున్న సినీ ప్రముఖులు, రాజకీయ నేతల తీరుపై ఇప్పుడు సౌత్ లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
హిందీ జాతీయ భాష కాకపోతే.. మీ సినిమాలు మా దగ్గర ఎందుకు డబ్ చేస్తున్నారు అన్న అజయ్ దేవగణ్ మాటలు మరీ హాస్యాస్పదంగా ఉన్నాయి. దేశంలో హిందీ మాట్లాడే వారి సంఖ్య ఎక్కువ. ఆ మార్కెట్ కోసమే సౌత్ సినిమాలు ఇప్పుడు అక్కడ డబ్ అవుతున్నాయి. ఆ లెక్కన చూసుకుంటే హిందీ సినిమా అయిన “మైనే ప్యార్ కియా”.. తెలుగులో ప్రేమ పావురాలు పేరిట విడుదలై సంవత్సరం రోజులు ఆడింది. అంటే.. అప్పుడు తెలుగు నేషనల్ లాంగ్వేజ్ అయ్యే.. ఇక్కడ హిందీ సినిమాని డబ్ చేశారా? ఈ పిచ్చి ప్రశ్నకి అజయ్ దేవగణ్ ఎలా సమాధానం చెప్తారు అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: South Indian Stars: బాలీవుడ్ ని వణికిస్తున్న ఈ టాప్-10 సౌత్ ఇండియన్ స్టార్స్ వీరే!
నిజానికి సౌత్ పై నార్త్ డామినేషన్ అనేది అన్నీ రంగాల్లో చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. కానీ.., ఇప్పుడు ఇండియన్ సినిమాపై బాలీవుడ్ ఆధిపత్యాన్ని సౌత్ సినిమాలు ఒక్కసారిగా అణిచివేశాయి. ఆ కడుపు మంటతోనే అజయ్ దేవగణ్ లాంటి సీనియర్ హీరో హిందీ నేషనల్ లాంగ్వేజ్ అని ట్వీట్ చేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి.. ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Hello @ajaydevgn sir.. the context to why i said tat line is entirely different to the way I guess it has reached you. Probably wil emphasis on why the statement was made when I see you in person. It wasn’t to hurt,Provoke or to start any debate. Why would I sir 😁 https://t.co/w1jIugFid6
— Kichcha Sudeepa (@KicchaSudeep) April 27, 2022