ఏడు సంవత్సరాల క్రితం అనగా.. 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. పెద్ద నోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. నల్లధనం, అవినీతిని అరిక్టటడం కోసమే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు మోదీ ప్రకటించాడు. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. కానీ సామాన్యులు మాత్రం.. ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం అంతమవుతుందని ఆశించారు. తమ దగ్గరున్న పెద్ద నోట్లను మార్చుకోవడం కోసం బ్యాంకుల ముందు గంటల కొద్ది క్యూలైన్లో నిల్చున్నారు తప్ప… ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టలేదు.
అయితే సామాన్యులు ఆశించినట్లు.. అవినీతి అంతం, నల్లధనం మాయం.. వంటివి చోటు చేసుకోలేదు కానీ.. దేశంలో మాత్రం పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత.. డిజిటల్ బ్యాంకింగ్, ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ వంటి మార్పులు చోటు చేసుకున్నాయి. అలానే.. జమ్ము కశ్మీర్‌లో స్థానికులను రెచ్చగొట్టి.. రాళ్లు రువ్వే సంఘటనలు చాలా వరకు తగ్గాయి. కారణం ఉగ్రమూకల దగ్గర ఉన్న నల్లధనం చెల్లకుండా అయిపోయింది.
ఇక పెద్ద నోట్ల రద్దు జరిగి ఏడేళ్లు పూర్తి అయినా సరే.. నేటికి కూడా దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. ఇక పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ.. సుప్రీంకోర్టులో కొందరు పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా కోర్టు.. పెద్ద నోట్ల రద్దు సమంజసమే అంటూ తీర్పు ఇవ్వడంతో.. మరోసారి ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేకాక మరో వార్త కూడా జోరుగా ప్రచారం అవుతోంది. అది ఏంటంటే.. పెద్ద నోట్ల రద్దుకు సుప్రీం కోర్టు.. మద్దతిచ్చింది కనుక.. త్వరలోనే కేంద్రం.. 2000ల రూపాయల నోటును కూడా రద్దు చేస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రసుత్తం మార్కెట్‌లో 2000 రూపాయల నోట్లు ఎక్కువగా కనిపించడం లేదు. ఎక్కడ ఏటీఎంలో మనీ డ్రా చేసినా సరే.. 2000 రూపాయల నోటు రావడంలేదు. దాంతో త్వరలోనే కేంద్రం మరోసారి పెద్ద నోట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోబోతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈసారి 2000, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తుందని.. ఇక మీదట 200 రూపాయల నోటే.. అతి పెద్ద నోటుగా చెలామణి అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇక సుప్రీం కోర్టు కూడా కేంద్ర నిర్ణయాన్ని సమర్థించడంతో.. మళ్లీ మోదీ మరోసారి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయో ముందు ముందు తెలుస్తోంది. మరి మరోసారి మోదీ ప్రభుత్వం.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంటుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.