కళ్ళు లేకపోతే వ్యక్తిగత పనులు చేసుకోవడమే కష్టం. అలాంటిది ఉద్యోగం, వ్యాపారం చేయడం అంటే ఇంకెంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ లోకంలో చాలా మంది లోపాన్ని పక్కన పెట్టి సక్సెస్ ఫుల్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అలాంటి వారిలో భూమిక ఒకరు. ఈమెకు రెండు కళ్ళు కనిపించవు. కానీ యూట్యూబ్ లో వంటల వీడియోలతో ఆమె సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నారు.
కళ్ళు లేకపోతే రోజూ వారి దినచర్యను సాగించడం చాలా కష్టం. కళ్ళు లేని వారికి ఆ బాధ ఎలా ఉంటుందో తెలియదు గానీ వారిని అలా చూసిన వారికి మాత్రం చాలా బాధ కలుగుతుంది. రోజంతా చీకటితో కలిసి జీవనం సాగిస్తున్నారో తలచుకుంటేనే భయం వేస్తుంది. అలాంటిది ఎవరూ సాధించని విజయాలను వారు సాధిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, ముచ్చట వేస్తుంది, సిగ్గు కూడా పడాల్సి వస్తుంది. ఎందుకంటే కళ్లుండి కూడా ఏమీ చేయలేకపోతుంటే.. కళ్ళు లేకపోయినా కూడా ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారు. అలాంటి వారిలో భూమిక ఒకరు. ఈమె పుట్టుకతో అంధురాలు కాదు. పెళ్ళైన తర్వాత అరుదైన వ్యాధి కారణంగా తన కంటి చూపును కోల్పోయారు.
బెంగళూరులోని దొడ్డబల్లాపూర్ లో భూమిక (40) నివసిస్తున్నారు. ఈమెకు పెళ్ళైన పదేళ్ల తర్వాత కంటి చూపును కోల్పోయారు. 2010లో తలనొప్పిగా ఉందని హాస్పిటల్ కి వెళ్తే.. ఆమెకు ఆప్టిక్ న్యూరోటిస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు తెలిసింది. ఈ వ్యాధి 5 లక్షల్లో ఒకరికి వస్తుంది. ఈ వ్యాధి కారణంగా ఆమె మెల్లమెల్లగా కంటి చూపును కోల్పోతూ వచ్చారు. 2018లో పూర్తిగా కంటిచూపు కోల్పోయారు. దీంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. ఇక తన జీవితం ముగిసిపోయిందని బాధపడ్డారు. ఆ సమయంలో ఆమెకు తన భర్త సుదర్శన్ సహా కుటుంబ సభ్యులు అండగా నిలబడ్డారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహంతో అంధురాలైనా గానీ ఏదైనా సాధించాలన్న కోరిక బలంగా ఆమెలో నాటుకుపోయింది.
ఆ సమయంలో భూమిక బంధువు ఒకరు యూట్యూబ్ లో వంటల వీడియోలతో ఆదాయం సంపాదిస్తున్నారని తెలుసుకుని ఈమె కూడా కుకింగ్ వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నారు. భూమిక కిచెన్ పేరుతో ఛానల్ ని ప్రారంభించి వంటల వీడియోలు అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. 2018లో యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించిన ఆమెకు రెండు నెలల్లోనే ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. 79,300 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మొదట్లో వంట చేయడానికి చాలా ఇబ్బంది పడేవారు. కుళ్ళిన కూరగాయలను గుర్తించడం, కోయడం, మసాలా దినుసులను గుర్తించడం చాలా కష్టంగా ఉండేది. అయినప్పటికీ పట్టు వదల్లేదు. బ్లైండ్ ఫ్రెండ్ లీ కుకింగ్ వాట్సాప్ గ్రూప్ లో చేరి కూరగాయలను శుభ్రం చేయడం, కోయడం, వంట సామాగ్రిని గుర్తించడం వంటి మెళకువలు నేర్చుకున్నారు.
అలా ఆమె డైలీ వంట వీడియోలు పెడుతూ యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు. సులభంగా, తక్కువ పదార్థాలతో వండడం ఈమె ప్రత్యేకత. ఈమె వీడియోల ద్వారా బ్యాచిలర్స్ వంట చేసుకోవడం నేర్చుకుంటున్నారు. ఆమె రుచికరంగా, శుభ్రంగా వంట చేయడానికి కారణం ఆమె భర్త, కుటుంబ సభ్యులే అని.. తాను వంట చేస్తే దాన్ని వీడియోగా తీసి యూట్యూబ్ లో తన భర్త అప్లోడ్ చేస్తారని.. తన సక్సెస్ కి కారణం భర్త, అత్తామామలే అని ఆమె అంటారు. మరొక విశేషం ఏంటంటే.. యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన మొట్టమొదటి అంధ మహిళ ఈమె. అంధత్వం ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఓడించలేకపోయింది. మనిషిలో లోపం ఉన్నా కూడా లోకం మెచ్చుకునే స్థాయికి ఎదగవచ్చునని భూమిక నిరూపించారు. మరి కంటి చూపు లేకున్నా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న భూమికపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.