పురాణాల్లో సతీ సావిత్రి తన భర్త కోసం యమధర్మరాజును ఎదిరించింది. యమధర్మరాజు సావిత్రిని చూసి “అమ్మా! నీవు ఎందుకు నా వెంట వచ్చావు. ఇక మీదట ఈ దారి వెంట రాలేవు ” అని పలికాడు. దానికి సావిత్రి” యమ ధర్మరాజా! భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళటం భార్యల ధర్మం కదా” అని చెప్తూ… యమధర్మరాజు వెంటపడి, ప్రాధేయపడి తన భర్త ప్రాణాలను నిలబెట్టుకుంది. ఈ కాలంలో భర్తలను చంపే భార్యలు, భార్యలను చంపే భర్తలు పెరిగిపోతున్నారు. అయితే అలాంటి వారికి కనువిప్పు కలిగేలా ఇప్పుడు ఓ వనిత పసిబిడ్డను వెంటబెట్టుకుని తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా… భర్త కోసం అడవి బాట పట్టింది. అసలు ఆమె భర్తకు వచ్చిన సమస్య ఏంటి? ఆమె ఎందుకు అడవిలోకి వెళాల్సి వచ్చిందో తెలుసుకుందాం…
ఆమె ఛత్తీస్‌గఢ్ రాష్ర్టంలోని బీజాపూర్ జిల్లాలో మాంకెలి ప్రాంతానికి చెందిన అర్పిత. ఆమె భర్త అజయ్ రోషన్ ఓ ప్రభుత్వశాఖలో సబ్ ఇంజనీర్. ఓ రోజు అజయ్ రోషన్ అటెండర్ తో కలిసి ఘడ్ గోర్నా ఏరియాలోని రోడ్డు సర్వేకోసం వెళ్లాడు. ఆ సమయంలో వారిద్దరిని నక్సలైట్లు కిడ్నాప్ చేశారు. అది నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే బీజాపూర్ అటవీ ప్రాంతం. అలాంటి ఏరియాలో కిడ్నాప్ కు గురైన వారిద్దరిలో అటెండర్ ను నక్సలైట్లు వదిలేశారు. అజయ్ ను తమ వద్ద బందీగా ఉంచుకున్నారు. వారి డిమాండ్లు ఏంటో తెలియదు, ఎందుకు కిడ్నాప్ చేశారో తెలియదు.. ఆ ఆలోచనలతో అజయ్ భార్య అర్పిత మనస్సులో ఓ దడ మొదలైంది.
నా భర్త అమాయకుడు, తనకేమీ తెలియదు దయచేసి ఆయనను వదిలేయాలని పత్రికా ముఖంగా వేడుకుంది. ఐనా నక్సలైట్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పోలీసుల గాలింపు ప్రయాస మాత్రమే. తన భర్తను విడిపించటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయాత్నాలేంటో అర్థంకావట్లేదు. అందుకే ఆమె తన రెండేళ్ల కొడుకును వెంట బెట్టుకుని భర్త కోసం అడవి బాట పట్టింది. అది అసలే పోలీసులకు, నక్సలైట్లకు మధ్య నిత్యం యుద్ధం జరిగే ప్రాంతం. అలాంటి ప్రాంతంలోకి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వెళ్లింది. ఇప్పుడు ఆ సబ్ ఇంజనీర్ కే కాదు అతని భార్యకు ఎమైందో ఎవరికీ తెలియదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ దంపతుల ప్రాణాలు కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అర్పిత తన భర్త కోసం చేస్తున్న ఈ పోరాటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.