Kanika Tekriwal: జీవిత ప్రయాణంలో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనప్పుడు చాలామంది పోరాడటం ఆపేస్తారు. కానీ కొంతమంది మాత్రమే ఆటంకాలతో పోరాడి విజేతలుగా నిలిచి.. ఎంతోమందికి ఆదర్శప్రాయులు అవుతారు. అలా జీవితంతో పోరాడి గెలిచినవారిలో ఒకరు కనికా టేక్రివాల్. ఢిల్లీకి చెందిన జెట్‌సెట్‌గో(JET SET GO) ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్‌క్రాఫ్ట్ అగ్రిగేటర్ వెనుక ఉన్న మైండ్ ఆమెదే. ఆమె జీవితకథ తెలిస్తే ఎవరిలోనైనా స్ఫూర్తి కలగడం ఖాయం.
2012లో క్యాన్సర్ తో పోరాడి ఇండియన్ ఎయిర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అప్పుడు ఆమెకు సొంతంగా ఒక్క విమానం కూడా లేదు. ఓలా మరియు ఉబెర్ వంటి అగ్రిగేటర్ మోడల్‌ను ఉపయోగించి చార్టర్ ఎయిర్‌క్రాఫ్ట్ వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చేయాలో ఆమెకు తెలుసు. ప్రస్తుతం కనికా.. ప్రారంభించిన ‘జెట్‌సెట్‌గో’ స్వంత విమానాన్ని కలిగి ఉండటమే కాకుండా.. 150 కోట్ల టర్నోవర్‌తో దాదాపు 200 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఆమెకు ఢిల్లీ, ముంబై, చెన్నై మరియు హైదరాబాద్‌లో కార్యాలయాలు ఉన్నాయి.
కనికా రూ.5,600 పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి.. చార్టర్డ్ విమానాలను బుక్ చేసుకోవడానికి యాప్‌ను రూపొందించింది. మొదటి రెండు సంవత్సరాలలో, ఆమె వ్యాపారం కోసం క్లయింట్ల నుండి అడ్వాన్స్‌లు మరియు విక్రేతల నుండి క్రెడిట్ తీసుకుంది. 2014లో, చార్టర్డ్ అకౌంటెంట్ మరియు ఆక్స్‌ఫర్డ్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ అయిన సుధీర్ పెర్ల జెట్‌సెట్‌గోలో కో ఫౌండర్ గా చేరారు.
ఇప్పుడు జెట్‌సెట్‌గో ఖాతాదారులలో కార్పొరేట్లు, ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు ఇతర ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. ఈ సంస్థ ఆరు-సీట్లు నుండి 18-సీట్ల విమానాలతో సహా అనేక రకాల చార్టర్ విమానాలను అందిస్తుంది. మహమ్మారి సమయంలో కూడా కంపెనీ (2020-21) 1 లక్షమంది ఫ్లైయర్‌లను నిర్వహించి, 6,000 విమానాలను నడిపింది.
జెట్‌సెట్‌గో గురించి చెప్పుకోదగిన విషయం ఏంటంటే..ఛార్జీలు Uber లాగే చౌకగా ఉంటాయి. ఇందులో దూరాన్ని బట్టి రూ. 1000 నుండి రూ. 2500 వరకు ఉంటుంది. హెలికాప్టర్‌ను ద్వారా సర్వీస్ చేయబడుతుంది. భవిష్యత్తులో ఆదర్శంగా నిలిచే ఎయిర్ ట్యాక్సీల కాన్సెప్ట్‌ను క్యాష్ చేసుకునేందుకు కనికా కంపెనీ ప్రయత్నిస్తోంది.
భోపాల్‌లోని మార్వాడీ వ్యాపార కుటుంబంలో పుట్టిన కనికా జీవిత ప్రయాణం అంత తేలికైనది కాదు. సొంతంగా తన ఆలోచనతో.. కృషితో ఎన్నో అధిగమించి ఈ స్థాయికి ఎదిగింది. 23 ఏళ్ల వయసులో ఆమెకు క్యాన్సర్ సోకింది. అప్పుడు కుటుంబం ఆమెకు అండగా నిలిచింది. 12 కీమోథెరపీ సెషన్లు మరియు ఒక సంవత్సరం రేడియేషన్ తర్వాత, కనికా తిరిగి కోలుకుంది.
ఈ సమయంలో ప్రొఫెషనల్ సైక్లిస్ట్ లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ యొక్క ప్రేరణాత్మక పుస్తకాలను చదివింది. అతని మాటలు ఆమె జీవితంలో గొప్ప పాత్ర పోషించాయి. అదే స్పూర్తితో కనికా ‘జెట్‌సెట్గో’ను ప్రారంభించింది. ప్రస్తుతం ఇండియాలోని 72% ఫ్లయిట్స్ ఆమె కంపెనీనే మేనేజ్ చేస్తుండటం విశేషం. చిన్నప్పుడు పైలట్ కావాలని కలలుగన్న కనికా.. పెరిగాక ఏకంగా ఫ్లయిట్స్ కంపెనీనే ప్రారంభించడం గొప్ప విషయం కదా.. మరి కనికా టేక్రివాల్ స్టోరీ స్ఫూర్తిగా అనిపిస్తే మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.