Infant: కొన్ని సార్లు మనిషి ఊహలకందని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటనలు జరిగినపుడు ఆశ్చర్యం కలగక మానదు. అలా మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తే ఘటన ఒకటి తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. యాక్సిడెంట్‌లో చనిపోయిన తల్లి కడుపులోంచి బిడ్డ బయటకు తన్నుకు వచ్చింది. లారీ టైర్ కింద తల్లి నుజ్జునుజ్జయినా బిడ్డ మాత్రం క్షేమంగా బయటపడింది. ఈ వింత ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, ఫిరోజాబాద్ జిల్లా ఆగ్రాకు చెందిన కామిని అనే 26 ఏళ్ల గర్భిణి బుధవారం తన భర్తతో కలిసి కోట్లా ఫరిహలోని పుట్టింటికి బైకుపై బయలుదేరింది.
వారు బర్‌తారా గ్రామం దగ్గరకు రాగానే బైకుకు ఎదురుగా ఓ కారు దూసుకొచ్చింది. కామిని భర్త కారునుంచి బైకును తప్పించే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో కామిని బైకుపైనుంచి కింద రోడ్డుపై పడిపోయింది. అదే టైంలో అటువైపు నుంచి వస్తున్న ఓ ట్రక్కు ఆమెపైనుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది. అయితే, ట్రక్కు టైరు ఒత్తిడి కారణంగా ఆమె కడుపులో ఉన్న బిడ్డ మాత్రం బయటకు తన్నుకు వచ్చింది. ప్రాణాలతో బయటపడింది.
ఈ ఘటనలో తండ్రీ, బిడ్డకు ఎలాంటి గాయాలు కాలేదు. అయినప్పటికి బిడ్డను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి నియోనాటల్ చికిత్స అందుతోంది. ఇక, ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్.. లారీని అక్కడే ఉంచి పరారయ్యాడు. కామిని మరణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ కోసం అన్వేషిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి! కారణం?