ఒకప్పుడు వివాహం, ప్రేమ అంటే స్త్రీ, పురుషులిద్దరి మధ్య ఏర్పడే బంధం. కానీ నేటి కాలంలో స్వలింగ సంపర్క వివాహాలు, ప్రేమలు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా దేశాల్లో ఈ తరహా బంధాలకు ఆమోదం లభిస్తుంది. సమాజంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తల్లిదండ్రులు కూడా బిడ్డల సంతోషమే ముఖ్యం అనుకుని.. ఈ తరహా బంధాలకు ఆమోదం తెలుపుతున్నారు. తాజాగా మన దేశంలో కూడా ఈ తరహా వివాహాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరు స్వలింగ సంపర్కులు.. తమ వివాహానికి అనుమతి కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు..
గత 15 ఏళ్లుగా తాము ప్రేమలో ఉన్నామని, తమ పెళ్లికి అనుమతి ఇవ్వాలని కోరుతూ.. ఉత్కర్ష్ సక్సేనా, అనన్య కోటియా అనే ఇద్దరు యువకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న వీరిద్దరూ గత కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. దాంతో ఈ జంట తమ వివామానికి అనుమతి ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ జంటతో పాటు మరో ముగ్గురు కూడా తమ వివాహాలకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌లన్నింటిని మార్చిలో విచారణ చేస్తామని ధర్మాసనం తెలిపింది. ఒకవేళ ఈ వివాహాలకు చట్టబద్ధత లభిస్తే.. తైవాన్ తర్వాత స్వలింగ సంపర్క వివాహాలను చట్టబద్ధం చేసిన రెండో ఆసియా దేశంగా ఇండియా రికార్డు సృష్టిస్తుంది. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇక ఉత్కర్స్, కోటియాల విషయానికి వస్తే.. వీరిద్దరూ 2008 నుంచి ప్రేమలో ఉన్నారు. ఉత్కర్ష్ సక్సెనా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీ స్కాలర్‌గా ఉన్నాడు. అయితే సంప్రదాయవాద దేశమైన భారత్‌లో స్వలింగసంపర్కానికి ఆమోదం లేకపోవడంతో.. ప్రజల దృక్పథాలు ఎలా మారతాయో చూద్దామని ఇన్నాళ్లు తాము వేచి చూశామని ఈ జంట తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది.. తర్వాత పరిణామాలు ఏంటి అనే దాని గురించి తాము భయపడతున్నట్లు ఉత్కర్ష్ వెల్లడించాడు. ప్రస్తుతం మేం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాం.. మా బంధాన్ని విడగొట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతునే ఉన్నాయి. ఏం జరుగుతుందో వేచి చూస్తున్నాం’’ అని తెలిపారు.
ఇక ఇటీవల కాలంలో భారతీయ సమాజంలో స్వలింగ సంపర్కానికి ఆమోదం తెలుపుతూ ఉండటంతో LGBTQ వ్యక్తులు తమ బంధం గురించి బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఇక స్వలింగ సంపర్కం అసహజ లైంగిక చర్య కాదని, కాబట్టి ఇది భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్ 377 కిందికి రాదని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ దీపక్ మిశ్రా సహా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ గతేడాది మార్చిలో తీర్పు వెల్లడించింది. గే సెక్స్ నేరం కాదని, అది సెక్షన్ 377 కిందకు రాదని ఐదుగురు జడ్జిలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారని జస్టిస్ మిశ్రా వెల్లడించారు. మరి వీరి వివాహానికి కోర్టు ఆమోదం తెలుసుతుందా లేదా అనేది చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.