శత్రువుకి సైతం సాయం చేయడం భారత సంస్కృతిలో భాగం. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం భారతీయుల నైజం. మన దగ్గర తినడానికి ఒక్క మెతుకే ఉన్నా ఆ మెతుకు కూడా ఆకలి అన్న వారికి పెట్టే జీవన విధానం మనది. ఇక ఈ విషయంలో భారత ఆర్మీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మనుషుల ప్రాణాలను కాపాడడం కోసం ఎంతకైనా తెగిస్తారు. ఎంత రిస్క్ అయినా చేస్తారు. టర్కీ-సిరియా దేశాలు భూకంపంతో వణికిపోతుంటే.. మేమున్నాం అంటూ భారత ఆర్మీ ఆపన్న హస్తం అందిస్తోంది.
టర్కీ–సిరియా దేశాల్లో భూకంపాలు ప్రళయం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. భూకంపాల దాటికి ఆ దేశాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. టర్కీ-సిరియాలో సంభవించిన భూకంపాల కారణంగా వేలకు పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. భూకంపం సంభవించి రోజులు గడుస్తున్నా ఇంకా శిథిలాల కింద ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని స్థానిక మీడియా ఛానళ్లు కథనాలు రాస్తున్నాయి. తమని రక్షించడానికి ఎవరైనా రావాలి అంటూ వేడుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో భారత ఆర్మీ సైనికులు ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఆపరేషన్ దోస్త్ పేరుతో మీకు మేమున్నాం అంటూ భారత్ భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ టర్కీ వెళ్లి సహాయక చర్యలను చేపడుతున్నారు.
ఫిబ్రవరి 7న టర్కీ-సిరియా క్షతగాత్రులను కాపాడేందుకు 99 మంది వైద్య నిపుణుల బృందాన్ని ఇండియన్ ఆర్మీ అక్కడికి పంపింది. వారిలో మేజర్ బీనా తివారీ కూడా ఉన్నారు. భారత్ నుంచి సహాయక చర్యల కోసం అక్కడకు వెళ్లిన మేజర్ బీనా తివారీ భూకంప బాధితులకు అండగా నిలుస్తున్నారు. గడ్డకట్టే చలిని లెక్కచేయకుండా బాధితులకు అండగా నిలబడడం చూసి అక్కడి స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బీనా తివారీ తమ పట్ల చూపిస్తున్న ప్రేమకు టర్కీ వాసులు కరిగిపోతున్నారు. టర్కీ మహిళ ఒకరు.. బీనా తివారీని ముద్దాడిన ఫోటో, ఒక బాలికను కాపాడిన ఫోటో వైరల్ అవ్వగా.. ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
‘ఇస్కెందరన్ నగరంలో భారత ఆర్మీ చేత ప్రారంభమైన హాస్పిటల్ లో రక్షించబడ్డ బాలికతో మేజర్ బీనా తివారీ ఉన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద సైన్యాలను కలిగి ఉన్నాం. వారు ప్రజలను రక్షించడంలో, శాంతి పరిరక్షణ చర్యలు చేపట్టడంలో దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నారు. ఇది భారతదేశానికి ప్రపంచ వ్యాప్త చిత్రం అవుతుంది, ప్రపంచ వ్యాప్త చిత్రంగా ఉండాలి’ అంటూ ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా దృష్టిలో ఏదైనా మంచి విషయం కంటపడితే వెంటనే తన మనసులో ఉన్న భావాలను నెటిజన్స్ తో పంచుకుంటారు. ముఖ్యంగా దేశం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ముందు వరుసలో ఉంటారు. పరాయి దేశం వారికి మన వాళ్ళు అండగా నిలబడడం చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. అందుకే ట్వీట్ తో మేజర్ బీనా తివారీని ప్రశంసించారు.
28 ఏళ్ల మేజర్ బీనా తివారీ డెహ్రాడూన్ కి చెందిన యువతి. ఈమె కుటుంబ సభ్యులు మొత్తం దేశానికి సేవలు అందిస్తున్నారు. బీనా తివారీ తాతయ్య కైలానంద్ తివారీ (84) కుమావ్ రెజిమెంట్ సుబేదార్ గా సేవలు అందించి విరామం తీసుకున్నారు. ఆమె తండ్రి మోహన్ చంద్ర తివారీ (56) అదే రెజిమెంట్ లో సుబేదార్ గా సేవలు అందించి పదవీ విరమణ పొందారు. బీనా తివారీ భర్త కూడా డాక్టరే. ప్రస్తుతం ఆమె అస్సాంలో కల్నల్ యదువీర్ సింగ్ ఆధ్వర్యంలో పని చేస్తున్నారు. మరి టర్కీ-సిరియా భూకంప బాధితులకు అండగా నిలుస్తున్న భారత ఆర్మీపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Major Bina Tiwari with a rescued girl in the Hospital opened by the Indian Army in Iskenderun.
We have one of the largest armies in the world. They have decades of experience in rescue & peacekeeping operations. This can, & should be, the global image of India. #TurkeyEarthquake pic.twitter.com/ego2HyH0b2— anand mahindra (@anandmahindra) February 14, 2023