తూర్పు లద్దాఖ్‌లో 26 గస్తీ పాయింట్లను భారత్ కోల్పోయిందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. తూర్పు లద్దాఖ్‌లోని మొత్తం 65 గస్తీ పాయింట్లలో 26 గస్తీ పాయింట్లను మన దేశం కోల్పోయిందని అక్కడి సీనియర్ పోలీసు అధికారి ఒకరు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. ‘తూర్పు లద్దాఖ్‌లోని కారకోరం పాస్ నుంచి చుమూర్ వరకు మొత్తం 65 పెట్రోలింగ్ పాయింట్లు ఉన్నాయి. వీటిల్లో భారత సాయుధ దళాలు క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలి. అయితే మొత్తం 65 పెట్రోలింగ్ పాయింట్లలో 26 చోట్ల (5-17, 24-32. 37)కు మన భద్రతా బలగాలు వెళ్లలేకపోతున్నాయి’ అని లేహ్ ఎస్పీ పి.డి. నిత్య కేంద్రానికి అందజేసిన నివేదికలో తెలియజేశారు.
ఈ నివేదికను ఢిల్లీలో గురువారం జరిగిన పోలీసుల సదస్సులో కేంద్రానికి నిత్య అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు హోం మంత్రి అమిత్ షా, ఎన్ఎస్ఏ అజిత్ డోభాల్ కూడా పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో ఇండియా గస్తీని సరిగ్గా నిర్వహించడం లేదంటూ సాకుగా చూపి.. ఆ భూభాగాలను చైనా తమలో కలిపేసుకుంటోందని ఆ నివేదికలో హెచ్చరించారు. అలాంటి ప్రాంతాల్లో బఫర్ జోన్లను క్రియేట్ చేసి, సరిహద్దును వెనక్కి నెడుతోందని అందులో నిత్య పేర్కొన్నారు. చైనా అంగుళం తర్వాత అంగుళం భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తోందని.. ఈ వ్యూహాన్ని ‘సలామీ స్లైసింగ్’ అంటారని నివేదికలో వెల్లడించారు.
‘రెండు దేశాల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేపట్టిన చర్చల్లో భాగంగా ఏర్పాటు చేసే బఫర్ జోన్లను చైనా అవకాశంగా మలచుకుంటోంది. ఇక్కడి ఎత్తైన శిఖరాల మీద కెమెరాలను అమర్చి.. భారత బలగాల కదలికలను పసిగడుతోంది. బఫర్ జోన్లోకి మన సాయుధ దళాలు ప్రవేశించిన వెంటనే చైనా అభ్యంతరం చెబుతోంది. ఆ ప్రదేశం తమ భూభాగమంటూ వాదిస్తోంది. ఆ తర్వాత మరింత బఫర్ జోన్ ఏర్పాటు పేరుతో ఇండియాను వెనక్కి నెడుతోంది’ అని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఎస్పీ నిత్య విశ్లేషించారు. చైనా ఏకపక్షంగా బార్డర్స్‌ను మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఇండియా ఆరోపించిన నెల రోజులకే ఈ నివేదిక వెలుగులోకి రావడం గమనార్హం. ఇక గతేడాది డిసెంబర్ 9న భారత్-చైనా సైనిక దళాలు అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో భీకరంగా ఘర్షణపడిన సంగతి విదితమే. గల్వాన్ లోయ ఘటన తర్వాత జరిగిన పెద్ద ఘర్షణ ఇదే. మరి, భారత సరిహద్దులోని పలు గస్తీ పాయింట్లను చైనా అక్రమంగా తమలో కలిపేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.