దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రాంతాల్లో మత సంఘర్షణలు జరిగాయి.. జరుగుతూనే ఉన్నాయి. కానీ, అలాంటి పనులు చేసే వాళ్లు తలదించుకునేలా.. హిందూ- ముస్లింల మధ్య మత సామరస్యం వెల్లివిరిసేలా ఓ ఘటన జరిగింది. ఇద్దరు హిందూ మహిళలు తమకు చెందిన రూ.కోటిన్నర విలువజేసే భూమిని మసీదుకు రాసిచ్చారు. ఈ విషయం తెలుసుకుని సోషల్ మీడియాలో వేదికగా ఆ మహిళలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజెన్స్. అసలు వారు ఎందుకు అలా చేశారు? అందుకు ఏమైనా కారణం ఉందా తెలుసుకుందాం.
ఇదీ చదవండి: పెండ్లితో ఒక్కటైన 3 అడుగుల అబ్బాయి, 2 అడుగుల అమ్మాయి!
వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉధమ్ సింగ్ నగర్ జిల్లా కాశీపూర్ పట్టణంలో జరిగింది. కాశీపూర్ కు చెందిన రైతు లాలా బ్రజ్ నందన్ ప్రసాద్ రస్తోగి మత సామరస్యాన్ని ఎంతో నమ్మేవాడు. ముస్లింలకు సంబంధించిన ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఆయనే మొదటి విరాళం ఇచ్చేవాడు. ఆ ఊరిలో మసీదు చాలా చిన్నగా ఉండేది. ఆ స్థలంలో ప్రార్థనలు చేసుకునేందుకు ముస్లింలు ఎంతో ఇబ్బంది పడేవారు. అది గమనించిన లాలా తనకున్న పొలంలో కొంత ఈద్గాకి రాసివ్వాలని అనుకున్నాడు. కానీ, ఆ విషయం పిల్లలతో చెప్పకుండానే 2003లో 80 ఏళ్ల వయసులో మృతి చెందారు.
అయితే గతంలో ఓసారి బంధువులతో లాలా తన మనసులోని మాటను పంచుకున్నాడు. ఆ బంధువుల ద్వారా ఆయన కుమార్తెలకు ఈ విషయం తెలిసింది. వెంటనే నాన్న కోరిక తీర్చాలని వారు భావించారు. మీరట్, ఢిల్లీలో ఉంటున్న సరోజ్, అనితలు తమ సోదరుడు రాకేశ్ రస్తోగిని సంప్రదించారు. తండ్రి చివరికోరిక ఇది అని విషయం అతనికి చేరవేశారు. తండ్రి చివరి కోరిక అది అని తెలుసుకున్న రాకేశ్ కూడా అందుకు అంగీకరించాడు. తమ వాటాగా అందుకున్న భూమిని సరోజ్, అనిత మసీదు పెద్దలకు అందజేశారు. మేము చేసిన ఈ పనితో మా తండ్రి గారి ఆత్మ శాంతించి ఉంటుందని భావిస్తున్నాం. పిల్లలిగా ఆయన చివరి కోరిక తీర్చడం మా బాధ్యత అంటూ సరోజ్, అనిత తెలిపారు.
ఇదీ చదవండి: రైతును వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే దశ తిరిగింది!
ఈద్గాకు భూమిని దానం చేసిన లాలా కుటుంబం కోసం రంజాన్ కోసం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత ఐక్యతకు పాటుపడిన ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లను త్వరలోనే సత్కరిస్తామని తెలియజేశారు. లాలా బతికున్న రోజుల్లోనూ ప్రతి పండుగకు మొదటి విరాళం ఆయనే ఇచ్చేవాడని.. ముస్లింలకు పండ్లు, స్వీట్లు పంచిపెడుతూ ఉండేవారని మసీదు పెద్దలు తెలిపారు. లాలా మొదటి నుంచి మత సామరస్యం కోసం పాటుపడేవాడని తెలిపారు. లాలా బ్రజ్ నందన్ రస్తోగి చేసిన మంచి పనులు గురించి చుట్టుపక్కల గ్రామాల్లోని ముస్లింలు కూడా గొప్పగా చెప్పుకుంటారని తెలియజేశారు. సరోజ్, అనితలు చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.