ఒడిశా రాష్ట్రంలో బాలేశ్వర్ జిల్లాలో చోటు చేసుకున్న రైళ్ల ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో వెయ్యి మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతికపరమైన సమస్య వల్ల ఇలా జరిగిందా? లేక మానవ తప్పిదం వల్ల ఇలా జరిగిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. స్థానిక అధికారులు, రైల్వే అధికారులు చెప్తున్న దానికి పొంతన లేదు. ముందు బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి పక్క పట్టాలపై పడిందని.. దాన్ని షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టిందని స్థానిక అధికారులు చెబుతున్నారు.
ఆ తర్వాత కోరమాండల్ బోగీలను పక్కనున్న ట్రాక్ పై నుంచి దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టినట్లు చెబుతున్నారు. రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ మాత్రం మరోలా చెబుతున్నారు. ముందు కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడంతో పట్టాలు తప్పిందని.. ఈ రైలు బోగీలను బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ రైలు ఢీకొట్టిందని అన్నారు. దీంతో ప్రమాదంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రైల్వే అధికారి చెప్పింది నిజమైతే కనుక గూడ్స్ రైలు ఉన్న ట్రాక్ పైకి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలుని ఎలా అనుమతించారన్న ప్రశ్న తలెత్తుతోంది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక సమస్య కారణంగానా లేక మానవ తప్పిదం వల్ల సమాచార లోపం తలెత్తిందా అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైలు ప్రమాదాలను నివారించేందుకు రైల్వేశాఖ దేశవ్యాప్తంగా ‘కవచ్’ పేరుతో యాంటీ కొలిజన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంటుంది. లోకో పైలట్ రెడ్ సిగ్నల్ ను పట్టించుకోకుండా రైలును ముందుకు తీసుకెళ్తే కనుక కవచ్ వ్యవస్థతో ఆటోమేటిక్ గా బ్రేకులు అప్లై అవుతాయి. పట్టాలు సరిగా లేకున్నా, ఎదురెదురుగా రైళ్లు వస్తున్నా, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినా జరగబోయే ప్రమాదాన్ని గుర్తించి ఈ కవచ్ వ్యవస్థ ఆపుతుంది. ప్రస్తుతం దేశంలో కొన్ని మార్గాల్లోనే ఇది అందుబాటులో ఉంది. రైలు ప్రమాదం జరిగిన మార్గంలో కవచ్ వ్యవస్థ లేదు. ఉండి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదని అంటున్నారు. అత్యంత రద్దీగా ఉండే మార్గంలో కవచ్ వ్యవస్థను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నిస్తున్నారు.