బొగ్గు గనిలోకి వెళ్లిన వాళ్లు.. ఇంటికి తిరిగి వచ్చేదాక కుటుంబ సభ్యులు ఎదురు చూస్తునే ఉంటారు. ఎంత భద్రతా చర్యలు తీసుకున్నా కొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. అలా పనికి వెళ్లిన భర్త ఇంటికి తిరిగి రాలేదు. పలువురు ఆశ్రయించినా జాడ తెలియకపోవడంతో పోరాటానికి దిగింది.
బొగ్గు గనుల్లో పని ఎంతో కఠినతరం. ఒక్కసారి లోపలికి వెళ్లిపోయాక బయట ప్రపంచం తెలియదు. ఇక అందులో పని చేసేందుకు వెళ్లిన కార్మికులు అన్నింటికి సంసిద్ధమై వెళతారు. గనిలోకి వెళ్లిన వాళ్లు.. ఇంటికి తిరిగి వచ్చేదాక కుటుంబ సభ్యులు ఎదురు చూస్తునే ఉంటారు. ఏ ఆపద రాకుండా చల్లగా ఇంటికి తిరిగి రావాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎంత భద్రతా చర్యలు తీసుకున్నా కొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. అయితే ఈ బొగ్గు గనిలోకి పనికి వెళ్లిన భర్త కొన్ని రోజుల నుండి కనిపించకుండా పోవడంతో అతని ఆచూకీ కోసం భార్య పెద్ద పోరాటమే చేసింది. ఈ వీర వనితది అసోం రాష్ట్రం.
ఆ మహిళ పేరు ఊర్వశి మోరన్. భర్త ప్రాంజల్ మోరన్‌తో కలిసి తిన్సుకియా జిల్లాలోని షుకాని గ్రామంలో నివసిస్తున్నారు. జనవరి 12న లిడులోని అక్రమ మైనింగ్ తవ్వకాల సమయంలో పనికి వెళ్లిన ప్రాంజల్ గల్లంతయ్యాడు. అతడి జాడ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో భర్త ఆచూకీ కోసం భార్య ఊర్వశి రంగంలోకి దిగింది. ముందుగా లిడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానీ మాఫియా గ్యాంగ్ ఒత్తిడితో పోలీసులు ఫిర్యాదును స్వీకరించలేదు. తన భర్త ఆచూకీ తెలపాలంటూ ముఖ్యమంత్రికి కూడా మొమొరాండం పంపింది. ఊర్వశికి సైతం రూ.5 లక్షలు ఇవ్వజూపింది మైనింగ్ మాఫియా గ్యాంగ్.
కానీ ఊర్వశి ఆ డబ్బును తీసుకోలేదు. తనకు తన భర్త కావాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి నిరసన కూడా చేపట్టింది. అయితే స్థానిక పోలీసులు సహకరించకపోవడంతో పాటు భర్త ఆచూకీ లభించక రెండు నెలలు గడిచిపోవడంతో అతడి జాడ కోసం రాష్ట్ర డీఐజీని ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. 650 కిలోమీటర్ల దూరమున్నగౌహతికి వెళ్లింది. చిన్నవాడైన తన కుమారుడితో కలిసి గౌహతికి చేరింది. రాష్ట్ర డీఐజీ.. జీపీ సింగ్ను తన కార్యాలయంలో కలిసింది. ఘటన మొత్తాన్ని ఆయనకు వివరించింది. తనకు న్యాయం చేయాలని ప్రాథేయపడింది. దీనిపై తక్షణమే స్పందించిన డీఐజీ.. ఊర్వశి భర్త ప్రాంజల్ను వెతికిపెడతామని ఆమెకు హామీ ఇచ్చారు.
దక్షిణ అసోం ఇన్‌ఛార్జ్ ఐజీపీ జిత్మల్ డేల్‌కు దర్యాప్తు బాధ్యతను అప్పగించారు. ప్రాంజల్ తప్పిపోయిన బొగ్గుగని ప్రాంతానికి.. సోమవారం తన టీంతో వెళ్లాడు ఐజీపీ జిత్మల్ డేల్. వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం బొగ్గు గనులలో చనిపోయి.. కుళ్లిపోయిన స్థితిలో ప్రాంజల్ మృతదేహాన్ని గుర్తించారు. భర్త చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న ప్రాంజల్ భార్య, అతడి కుటుంబ సభ్యులు భోరున విలపించారు. ప్రస్తుతం ఈ ఘటన మొత్తం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ప్రాంజల్ కుటుంబానికి రూ. 4 లక్షల సాయం అందింది.