భర్త, అత్తింటి వారి చేతిలో వేధింపులకు గురైన మహిళలు, ఆ బాధలు తాళలేక నిరసనలకు దిగుతుంటారు. లేదంటే గృహ హింస కేసు పెడతారు. కానీ భార్య చేతిలో వేధింపులకు గురౌతున్న భర్తల సంగతేంటీ. తమకు న్యాయం చేయాలంటూ భార్యా బాధిత భర్తల సంఘం నిరసనకు దిగింది.
దేశంలో భర్త చేతిలో వేదన అనుభవిస్తున్న భార్యలు ఎంతో మంది ఉన్నారు. భర్త చేతిలో తన్నులు, తిట్లు తిని, అన్ని సహించి, భరించి ఎంతో మంది మహిళలు బతుకీడుస్తున్నారు. ఇవి పడలేని వాళ్లు పోలీస్ స్టేషన్, కోర్టులకెక్కి గృహ హింస కింద కేసులు పెడుతున్నారు. వీరి రక్షణ కోసమే ప్రత్యేకమైన న్యాయస్థానాలు కూడా ఉన్నాయి. కానీ భార్య గయ్యాళితనానికి బలౌతున్న భర్తల సంగతేంటీ. తనను భార్య వేధిస్తుందని ఎవ్వరికీ చెప్పినా.. నవ్వుకుంటారే తప్ప అతడికి కనీస సానుభూతి కూడా దొరకదు. భార్యను ఏమన్నా అంటే సంసారం రోడ్డుకెక్కుతుందేమోనని కిక్కురుమనకుండా కాపురం చేస్తున్న భర్తలు దేశంలో నానాటికి పెరుగుతున్నారు.
భార్య బాధితులు ఎప్పటి నుండో ఉన్నప్పటికి.. బయట పడిన సంఘటనలు చాలా అరుదు. ఇప్పుడు వీరు తమకు న్యాయం చేయాలంటూ రోడ్డున పడ్డారు. ఫ్లకార్డులు ప్రదర్శించి.. మహిళలకు అనుకూలంగా ఉన్న చట్టాలను సవరించాలంటూ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. వీటితో పాటు కొన్నిడిమాండ్లతో కూడిన గోడును వెలిబుచ్చారు. ఇంతకు ఆ భార్యా బాధిత భర్తలు ఎక్కడ నిరసన చేపట్టారనుకుంటున్నారా.. ఇంకెక్కడండీ కర్ణాటక రాజధాని బెంగళూరులో. భార్యా బాధిత భర్తలంతా ఓ సంఘంగా ఏర్పడి, ఈ వినూత్న ఆందోళనలకు దిగారు. ఫ్రీడం పార్కులో సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ నేతృత్వంలో ఈ నిరసనలు చేపట్టారు. తమ నిరసనలను దేశ వ్యాప్తంగా చేపట్టనున్నట్లు తెలిపారు.
నగరంలో భార్య బాధితుల భర్తల సంఘం రెండు రోజుల పాటు నిరసన చేపట్టింది. తమను, తమ కుటుంబ సభ్యులను తమ భార్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వేధిస్తున్నారంటూ రోడ్డుకెక్కారు. తమ ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా తీసుకెళ్లాలని భర్తలు నిర్ణయించారు. ఈ సందర్భంగా భర్తలు పలు డిమాండ్లు చేశారు. గృహ హింస చట్టంలోని లొసుగులను అడ్డు పెట్టుకుని కొందరు భార్యలు విదేశాల్లో ఉంటున్న తమ కుటుంబసభ్యులనూ వేధిస్తున్నారని ఆరోపించారు. ఎన్ఆర్ఐలకు సంబంధించిన ఈ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు మరికొన్నింటిని డిమాండ్ చేస్తున్నారు.
భర్తలు చేస్తున్న ప్రధాన డిమాండ్లు ఇలా ఉన్నాయి. విడాకులు తీసుకున్నప్పుడు వారికి పుట్టిన సంతానం ఇద్దరి వద్ద ఉండేలా చట్టాలను సవరించాలని, తప్పుడు కేసులతో వేధించే మహిళలకు శిక్షలు విధించాలని కోరుతున్నారు. వృద్ధులైన అత్తమామలపై కోడళ్లు పెట్టిన కేసులు రద్దు చేయాలని, విడాకులు తీసుకున్న భార్య శ్రీమంతురాలై ఉంటే ఆమెకు భరణమిచ్చే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భార్య అత్తింటి నుంచి వస్తున్న ఒత్తిళ్లు వేధింపులతో ప్రాణాలు తీసుకుంటున్న భర్తలకు ప్రభుత్వాలు అండగా ఉండాలని వేడుకున్నారు. భార్య బాధిత భర్తలు చేస్తున్న ఈ డిమాండ్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.