పెళ్లై.. గృహిణిగా అత్తారింట్లో అడుగుపెట్టిన మహిళ.. భర్త, పిల్లల సంరక్షణ కోసం తనను తాను అంకింతం చేసుకుంటుంది. జీతంతో కూడిన పనిని వదులుకుని, కుటుంబం కోసం కష్టపడుతుంది. దీంతో చివరకు ఆమెకు తనకంటూ ఏమీ సంపాదించుకోలేకపోతుంది.
ఇటీవల కాలంలో కొన్ని కోర్టు తీర్పులు పెను సంచలనం అవుతున్నాయి. ముఖ్యంగా భార్య, భర్తలకు సంబంధించిన తీర్పుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ఇద్దరు అంగీకారంతో సహజీవనం చేయవచ్చునని భార్యా భర్తల బంధానికి బీటలు వారేలా సుప్రీం కోర్టు ఉండగా.. ఇటీవల భార్య, భర్తల విడిపోవాలనుకుంటే.. కలిసి ఉండలేని పరిస్థితులు ఏర్పడితే.. ఆరు నెలల వ్యవధి కూడా లేకుండా విడాకులు మంజూరు చేయవచ్చునని తీర్పునిచ్చింది అదే అత్యున్నత న్యాయం స్థానం. ఇప్పుడు మరో కోర్టు తీర్పు పెను సంచలనంగా మారింది. భర్త ఆస్తిలో భార్యకు కూడా సమాన హక్కు ఉందని పేర్కొంది.
భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకు కూడా సమాన వాటా పొందే హక్కు ఉందని మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది. గృహిణిగా ఆమె ఇంటి బాధ్యతలు చక్కబెడుతూ, కుటుంబం ఆర్థిక పరంగా ఎదిగేందుకు సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో ఆస్తిలో వాటాకు ఆమె అర్హురాలని పేర్కొంది. భార్య అందులోనూ గృహిణిగా ఆమె ఇంటి కోసం చేసే శ్రమను ఏ చట్టం గుర్తించనప్పటికీ.. మద్రాసు హైకోర్టు తీర్పు ఓ మైలు రాయి తీర్పు అని చెప్పవచ్చు. ‘భార్య తమ ఇంటి పనులను నిర్వహించడం ద్వారా భర్త సంపాదనకు, ఆస్తులు కొనుగోలుకు తోడ్పాటును అందిస్తుంది. అందువల్ల ఆస్తిపై హక్కును నిర్ణయించేటప్పుడు వీటిని కోర్టు ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంటుంది. దశాబ్దకాలంగా ఇంటిని, కుటుంబాన్ని చూసుకునే జీవిత భాగస్వామైన భార్య.. భర్త ఆస్తిలో వాటాకు అర్హులు’అని జస్టిస్ కృష్ణన్ రామస్వామి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
‘పెళ్లై.. గృహిణిగా అత్తారింట్లో అడుగుపెట్టిన మహిళ.. భర్త, పిల్లల సంరక్షణ కోసం తనను తాను అంకింతం చేసుకుంటుంది. జీతంతో కూడిన పనిని వదులుకుని, కుటుంబం కోసం కష్టపడుతుంది. దీంతో చివరకు ఆమెకు తనకంటూ ఏమీ సంపాదించుకోలేకపోతుంది. ఇది ఖండించదగినది. భార్యా భర్తల ఇద్దరి సమన్వయం లేకుండా ఒక కుటుంబం నిలబడదు. అలాగే భర్త సంపాదనకు అడ్డుపడకుండా భార్య బాధ్యతాయుతంగా తన పనులు నిర్వర్తించడం వల్ల.. అతడు ఆస్తులు సంపాదించగల్గుతున్నాడు. కాబట్టి ఇద్దరూ తమ ఆస్తిలో వాటాకు సమాన అర్హులు’అని ఓ భార్యా భర్తల కేసు విచారణ సందర్భంగా పేర్కొంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని నేవేలికి చెందిన కన్నయ్య నాయుడు, భానుమతి భార్యాభర్తలు. వీరికి 1965లో వివాహం అయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే అతడు 1983 నుండి 1994 వరకు స్టీల్ కంపెనీలో పనికి నిమిత్తం దుబాయ్ వెళ్లిపోయాడు.
తాను విదేశాలు వెళ్లాక.. తాను సంపాదించిన డబ్బుతో ఆస్తులు కొనుగోలు చేసిందని, వాటిని ఆక్రమించుకునేందుకు చూస్తుందని 2002లో భార్యపై భర్త కోర్టులో కేసు వేశాడు. ఇటువంటి మహిళలకు తన ఆస్తిలో వాటా లేదని కోర్టుకు వెళ్లాడు. కాగా, అతడు చనిపోయాడు. ఆ తర్వాత ఆమె పిల్లలు హైకోర్టులో రెండో అప్పీల్ దాఖలు చేశారు. తమ తల్లి సంపూర్ణ సహకారాలు లేకుండా ముగ్గురు పిల్లల్ని తను చూసుకోకుండా ఉండి ఉంటే అతను ఏ విధంగా డబ్బులు సంపాదించేవారని ప్రశ్నించారు. ఆమె తన పుట్టింటి నుంచి తెచ్చిన డబ్బు తన భర్త విదేశీ యానం గురించి ఖర్చు చేశానని అదంతా వదిలేసి ఇప్పుడు కేసు వేశారని పేర్కొన్నారు. ఆమె ఉద్యోగం చేసి ఉంటే భర్తతో సమానంగా సంపాదించేదని వారు తరుపు లాయర్ కూడా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఈ తీర్పు వెల్లడించింది.