ఆన్‌లైన్ వీడియో గేమ్స్ గురించి పిల్లలను అడిగితే ఠక్కున చెబుతారు. వాటిపై వారికున్న అవగాహన మరొకరికి ఉండదు. వీటిపైన పెట్టే శ్రద్ధ చదువుల్లో కూడా పెట్టరు. యువత సైతం రమ్మీ, రమ్ రమ్మీ వంటి గేమ్స్ లకు బానిసలై అప్పుల చేయడంతో పాటు అవి తీర్చలేక ప్రాణాలు పోగొట్టుకున్నవారున్నారు. కానీ ఆ మహిళ వీడియో గేమ్స్ ఆడుతూ లక్షలు సంపాదిస్తుంది.
పిల్లలు, పెద్దలకు ప్రస్తుతమున్నవ్యాపకం సెల్ ఫోనే. చిన్నలు, పెద్దలు కాస్త తీరిక దొరికినా సెల్ ఫోనుకు అతుక్కుపోవాల్సిందే. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆన్‌లైన్ చదువులతో చిన్నారులకు ఫోన్లు అందించడంతో వాటికి బానిసలయ్యారు. దీంతో స్కూల్ కెళ్లి రావడం ఆలస్యం సెల్ ఫోన్ తీసుకుని అందులో వీడియో గేమ్స్ ఆడేస్తుంటారు. క్యాండీ క్రష్ నుండి బీజిఎమ్ఐ, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీఫైర్ వంటి ఆన్‌లైన్, ఆఫ్ లైన్ గేమ్స్ ఆడుతుంటారు. యువత సైతం ఆన్ లైన్ గేమ్స్ ఆడుతూ సమయాన్ని వృథా చేసుకన్న వాళ్లు ఉన్నారు. రమ్మీ, రమ్ రమ్మీ వంటి గేమ్స్ వంటి వాటిల్లో డబ్బులు పెట్టి పొగొట్టుకున్నవారున్నారు. గేమ్స్ మాయలో పడి ప్రపంచాన్ని కూడా మర్చిపోతుంటారు. ఇక అయితే ఓ మహిళ మాత్రం ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఆడుతూ లక్షలు గడిస్తున్నారు. ఇంతకు ఆ మహిళకు ఎక్కడ వారంటే..?
జమ్ముకాశ్మీర్‌కు చెందిన మహిళ రీతు స్లాతియా మాత్రం కొన్నేళ్లుగా ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ సంపాదిస్తున్నారు. ఆమెకు 20 ఏళ్ల వయస్సులో పెళ్లి అయిన ఆమె ఇంట్లో పనులు చేసుకుంటూనే ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ డబ్బులు గడిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వయస్సు 44 ఏళ్లు. గేమింగ్ యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడంతో వ్యూస్ వల్ల డబ్బులు గడిస్తున్నారు. వీటి ద్వారా ఏడాదికి సుమారు రూ.1.20 లక్షలకు పైగా డబ్బును ఆర్జిస్తున్నారు. అంటే నెలకు కచ్చితంగా రూ.10 వేలు ఇంట్లో ఉండే సంపాదిస్తున్నారు రీతు. ఆ ఆదాయంతో కుటుంబానికి బాసటగా నిలుస్తున్నారు. యాప్‌లో ‘మమ్మా బ్లాక్‌బర్డ్’ అనే ఫ్రొఫెల్ పేరుతోనే ఆమె ఈ గేమ్స్ ఆడుతుంటారు. ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన రూటర్ అనే యాప్‌లో రీతుకు సుమారు 3.5 లక్షల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు.
ఇంత నైపుణ్యం సంపాదించడానికి తన కుమారుడే కారణమని రీతు చెబుతున్నారు. ‘నా చిన్నతనంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు, తదితర కారణాలతో నేను 12 తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. చిన్న వయస్సులోనే వివాహం జరిగింది. పెళ్లైయి పాతికేళ్లు గడిచాయి. భర్త, కుమారుడు అన్ని విషయాల్లో నన్ను ఎల్లపుడూ ప్రోత్సహిస్తుంటారు. నేను ఇంట్లో పని చేసుకుంటున్న సమయాల్లో నా కొడుకు ఎప్పుడూ ఫోన్లో గేమ్స్ ఆడడం గమనించేదాన్ని. ఈ క్రమంలోనే వాటి గురించి అడిగి తెలుసుకుని.. నేను కూడా ఆడాలనే ఆసక్తి నాలో పెరిగింది. కానీ, వయసురీత్యా ఇది ఎలా ఆడతారో అని అడగటానికి కాస్త మోహమాటపడేదాన్ని. చివరకు 2019లో నా కుమారుడ్ని ఈ గేమ్స్ గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాను. వాడే దగ్గరుండి గేమ్స్ ఎలా ఆడాలో నేర్పించాడు. ఇక అప్పట్నుంచి గేమ్స్ ఆడటం మొదలు పెట్టాను‘ అని తెలిపారు రీతు స్లాతియా
తాను గేమ్స్ ఆడుతుండటం చూసి కొంత మంది నవ్వేవారని కూడా చెబుతున్నారు. అది పిల్లలు కోసమని, వృద్దుల కోసం కాదని ఎద్దేవా చేసినట్లు చెప్పారు. అయితే దీని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నానని తెలిసి తనను ఆదరిస్తున్నారని తెలిపారు. ’నేను మొదట్లో బీజీఎమ్ఐ(బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా)అనే గేమ్ ఆడేదాన్ని. ఈ గేమ్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. ఆ తర్వాత ఫ్రీఫైర్ కూడా ఆడటం ప్రారంభించాను. కొద్దిరోజుల్లోనే వీటిల్లో ఆరితేరాను. ఇలా ఒకరోజు నా కుమారుడు గేమ్‌ప్లేలో లైవ్ ద్వారా ఇతరులతో మాట్లాడటం కూడా నేను చుశాను. ఇది నాలో గేమ్స్ గురించి మరింత తెలుసుకోవాలన్న ఉత్సుకతను మరింత పెంచింది. అప్పుడు ఈ లైవ్ ఎలా మాట్లాడతారని కూడా వాడ్నే అడిగి తెలుసుకున్నా. ఇలా ఒక్క సంవత్సరంలోనే అన్ని విషయాలను నేర్చుకున్నా. అనంతరం ఆన్‌లైన్ గేమింగ్ లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వడం ప్రారంభించా. లైవ్ ఇచ్చే సమయాల్లో నా కుమారుడి వయసున్న పిల్లలతో పాటు మరికొంతమంది నా లైవ్‌ను చూస్తూ.. నన్ను అనుసరించడం ప్రారంభించారు’ అని చెప్పారు.