ఇటీవల మద్యం అమ్మకాల్లో పలు రాష్ట్రాల్లో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ఎంతో దోహపడుతుంటాయి. మద్యం ద్వారా వచ్చే నిధులతో రాష్ట్రంలో పలు పథకాలు కూడా అమలు చేస్తుంటారు.
మందుబాబులకు ఇది చేదు వార్త అనే చెప్పాలి.. లిక్కర్ ధరలు మరింత ప్రియం కానున్నాయి. సెస్ కింద ఒక్కో బాటిల్ పై రూ.10 ‘కౌ సెస్’ విధిస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే మద్యంపై పెంచిన సుంఖాలు మరో మంచి పనికోసమే అని.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటీలపై రూ.25 వేలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇంతకీ మందుబాబులకు వడ్డంపు చర్యలు.. బాలికలకు ప్రయోజనం చేకూరే పథకం ఏ రాష్ట్రంలో అమలు అవుతుందంటే.. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇటీవలే హిమాచల్ ప్రదేశ్‌లో కేబినెట్ మీటింగ్ జరిగింది. అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఇవి అమలు కానున్నట్లు తెలిపారు. అంతేకాదు విద్యార్థులకు వరాల జల్లు కురిపించారు సీఎం సుఖ్విందర్ సింగ్. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 20 వేల మంది బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటీ కొనుగోలుపై రూ.25 వేల సబ్సీడీ అందించబోతున్నట్లు ప్రకటించారు. అలాగే పేదరికంలో ఉండి అర్హులైన మహిళలకు రూ.1500 నగదు ఇస్తామని సీఎం సుఖ్విందర్ తెలిపారు.
ఈ పథకాలకు ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి రూ.416 కోట్లు ఖర్చు అవుతుందని సీఎం తెలిపారు. అయితే ఇందు కోసం ఆర్థిక వనరులు సమకూర్చుకునే పనిలో భాగంగా మద్యం అమ్మకాలపై ‘కౌ సేస్’ ను విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మద్యం సీసాపై అధనంగా రూ.10 కౌ సేస్ (ఆవు సుంఖం) వసూలు చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ సేస్ ద్వారా ప్రతియేటా రూ.100 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చేటట్టు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రతి సంవత్సరం హిమాచల్‌ప్రదేశ్‌లో రూ.1,829 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతాయని సమాచారం.. ఈ మద్యం అమ్మకాల ద్వారా ఏటా కనీసం రూ.2,400 కోట్లు ఆర్జించాలని ఉద్దేశంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇటీవల మద్యం, పాలపై పన్నుభారం మోపిన విషయం తెలిసిందే. ఇక వచ్చే ఆదాయంలో కొంత మేర పంచాయితీరాజ్ అభివృద్ది చేసేందుకు నిధులు ఖర్చు చేస్తారు. అలాగే హెల్త్ సర్వీసెస్ విభాగం, అంబులెన్స్ సేవలను మెరుగు పర్చేందుకు నిధులు ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక బడ్జెట్ సమావేశంలో మరికొన్ని ప్రజాకర్షక పథకాలు ప్రకటించారు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమత్రి సుఖ్విందర్ సుఖు.