మీకెలాంటి వరుడు కావాలని అమ్మాయిలను అడిగితే సాఫ్ట్ వేర్ జాబ్ అందులోనూ సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజ్ లేదంటే ప్రభుత్వ ఉద్యోగం అది కూడా క్లాస్ 1 ఉద్యోగి కావాలంటున్నారు. అధిక ఆదాయాన్ని సంపాదించే డాక్టర్లను కోరుకుంటున్నారు.
ఆడపిల్లలు పెళ్లిళ్ల విషయంలో మినిమమ్ ఎక్స్‌ఫర్టేషన్ చేసే రోజులు పోయాయి. కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలని కలలు కంటున్నారు. మీకెలాంటి వరుడు కావాలని అమ్మాయిలను అడిగితే సాఫ్ట్ వేర్ జాబ్ అందులోనూ సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజ్ లేదంటే ప్రభుత్వ ఉద్యోగం అది కూడా క్లాస్ 1 ఉద్యోగి కావాలంటున్నారు. లేదంటే డాక్టర్లను కోరుకుంటున్నారు. మంచి వాడు, అర్థం చేసుకునే వాడు లేదా మనస్సు ఎరిగిన వాడు కావాలని కోరట్లేదు. ఆడ పిల్లలు ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టే.. ప్రైవేట్ ఉద్యోగులకు(సాఫ్ట్ వేర్ తరహా ఉద్యోగాలు మినహాయించి) ఆడ పిల్లలు దొరకడం లేదు. ఇక చిన్న ఉద్యోగస్థులు అయితే బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు. వీరందరి కన్నా రైతు పరిస్థితి మరి దారుణం. రైతు అనగానే పెళ్లి చూపులు కాదు కదా.. ఆ అబ్బాయి ఫోటో, గుణ గుణాలు తెలుసుకునేందుకు కూడా ఆసక్తి కనబర్చడం లేదు.
ఆకాశంలో సగం అన్నందుకే ఏమో పెళ్లిళ్ల విషయంలో అమ్మాయిల ఆశలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ మహారాష్ట్రకు చెందిన ఈ యువతి మాత్రం కాస్త భిన్నం. ఉన్నత చదువులు చదివి.. మంచి ఉద్యోగం చేస్తుంది. తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేద్దామనుకుని మంచి సంబంధాలు చూస్తుంటే.. రైతును పెళ్లి చేసుకుంటానని తన మనస్సులో మాట చెప్పింది. ఇంతకు ఈ అమ్మాయిది ఎక్కడటంటే మహారాష్ట్రలోని నాందేడ్. హడ్గావ్ తాలూకాలో గల సప్తి అనే చిన్న గ్రామంలో వైష్ణవి దిగంబర్ కదమ్ అనే అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. వైష్ణవి ఎంఎస్ ఎలక్ట్రానిక్స్‌తో పాటు ఎంఎస్‌డబ్బ్యు పూర్తి చేసింది. చదువు పూర్తి కాగానే తన ఊరిలోనే గోదావరి అర్బన్ బ్యాంకులో ఉద్యోగంలో చేరింది. ప్రస్తుతం బ్యాంకు మేనేజర్‌గా వ్యవహరిస్తోంది.
మంచి పొజిషన్‌లో ఉండటంతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. నగరాల నుండి ఇంజనీర్లు, డాక్టర్లు, గవర్నమెంట్ ఉద్యోగస్థుల సంబంధాలను తెచ్చారు తల్లిదండ్రులు. అయితే తనకు రైతు కుమారుడ్ని పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పింది. వాస్తవానికి వైష్ణవి తండ్రి వ్యవసాయం చేస్తూనే ఆమెను ఇంత చదివించారు. దీంతో ఆమెకు వ్యవసాయం అంటే ఇష్టం. ఈ కారణంతోనే రైతును వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. పూసాద్‌కు చెందిన నితిన్ పాటిల్ అనే రైతుతో వివాహం నిశ్చయించారు పెద్దలు. అతడికి 15 ఎకరాల పొలం ఉంది. ఈ ఆదివారం నాడు యావత్మాల్‌లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వైష్ణవి తీసుకున్న నిర్ణయంపై అందరూ ఆశ్చర్యపోవడంతో పాటు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.