ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజలకు ఎన్నో వరాలు ప్రకటిస్తుంటారు రాజకీయ నేతలు. సంక్షేమ పథకాలు, హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ మాజీ సీఎం ఇచ్చిన హామీ ఆసక్తి రేపుతోంది.
ఒకప్పుడు రైతు ఇంటికి పిల్లను ఇవ్వడం అంటే గొప్పగా భావించేవారు. వ్యవసాయం లాభసాటిగా ఉండే రోజుల్లో రైతుకు పిలిచి పిల్లను ఇచ్చేవారు. కానీ తరాలు మారాయి. కాలచక్రం గిర్రున తిరిగింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్‌కే డిమాండ్. పిల్లను ఇవ్వాలంటే ఒకటి సర్కారు నౌకరీ అయినా ఉండాలి లేదా లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా అయ్యుండాలి. వ్యవసాయం చేసే ఇంటికి, భూమిని నమ్ముకుని బతికే అన్నదాత ఇంటికి పిల్లను ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఇదిలాఉండగా.. కర్ణాటకలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావలనుకుంటోంది జేడీఎస్. అందుకే ప్రజలను ఆకట్టుకునే దిశగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తోంది. ఈ క్రమంలో జేడీఎస్ నేత కుమారస్వామి అన్నదాతలను ఆకట్టుకునే విధంగా ఓ పథకాన్ని ప్రకటించారు.
జేడీఎస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల పిల్లల పెళ్లిళ్లకు రూ.2 లక్షలు చెల్లించే పథకాన్ని తీసుకొస్తామన్నారు కుమారస్వామి. తుముకూరు జిల్లా, తిపటూరు నియోజకవర్గం హాల్మురకి గ్రామంలో పంచరత్న రథయాత్ర రోడ్‌షోలో ఆయన పైహామీ ఇచ్చారు. జేడీఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. తమకు అధిష్టానం లేదని.. ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామన్నారు కుమారస్వామి. కాగా, ఈ దఫా కర్ణాటక ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, సిద్ధరామయ్య ఇవే తమకు ఆఖరు ఎన్నికలని ప్రకటించారు. కుమారస్వామి కూడా 2028 ఎలక్షన్స్ తనకు ఆఖరి అసెంబ్లీ ఎలక్షన్స్ అని వెల్లడించారు. దీంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ‘చివరి ఎన్నికలు’ అనే మాటను ప్రధాన పార్టీలన్నీ అస్త్రాలుగా మారుస్తున్నాయని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. మరి.. ఈ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.