సాధారణంగా ఎన్నికల్లో గెలవడానికి అభ్యర్థులు పడరాని పాట్లు పడతారు. సాధ్యం కాదని తెలిసి.. ఎన్నో రకాల ఖరీదైన హామీలు ఇస్తారు. ఇక ఎన్నికల వేళ డబ్బు, మద్యం పంపిణీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఓటర్లు కూడా.. ఇప్పుడు కనిపిస్తే.. మళ్లీ ఐదేళ్ల వరకు మా వంక చూడరు.. అలాంటప్పుడు మేం మాత్రం ఎందుకు ఫ్రీగా ఓటేయ్యాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్లే అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారు. వార్డు మెంబర్‌గా గెలవాలన్నా సరే.. లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇక సర్పంచ్, ఇతరాత్ర పదవులు కోసం అయితే.. అర కోటి నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. గెలుపుతో సంబంధం లేకుండా.. ఎన్నికల బరిలో నిలిచే ప్రతి అభ్యర్థి డబ్బు ఖర్చు చేయాల్సిందే.
గెలిచిన వారి పరిస్థితి చెప్పలేం.. కానీ.. అంత డబ్బు ఖర్చు చేసి ఓడిన వారి బాధ గురించి వర్ణించడానికి మాటలు చాలవు. ఈ క్రమంలో ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థిని ఓదార్చడానికి ఓ ఊరి ప్రజలు వింత నిర్ణయం తీసుకున్నారు. ఊరంతా చందాలు వేసుకుని మరీ ఓడిపోయిన అభ్యర్థికి కోట్ల రూపాయల నగదు.. విలువైన కారు బహుమతిగా ఇచ్చారు. ఈ వింత సంఘటన వివరాలు..
ఈ వింత సంఘటన హరియాణాలో చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో రోహ్‌తక్ జిల్లా, లఖన్ అనే ఓ గ్రామం నుంచి ధర్మపాల్ అనే వ్యక్తి సర్పంచ్ బరిలో నిలిచాడు. గతంలో ధర్మపాల్ తండ్రి, తాతలు కూడా సర్పంచ్‌లుగా చేశారు. వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. ధర్మపాల్ ఎన్నికల్లో నిల్చున్నాడు. విజయం సాధించడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. కానీ దురదృష్టం కొద్ది.. ఓటమి పాలయ్యాడు. అది కూడా కేవలం 66 ఓట్లతో ఓడిపోయాడు.
దాంతో ధర్మపాల్ మీద గ్రామస్తులకు జాలి కలిగింది. తమ ఇంట్లో సొంత మనిషిలా తిరిగే వ్యక్తి ఇలా ఓడిపోయి బాధపడటం వారికి నచ్చలేదు. దాంతో ధర్మపాల్‌ను ఓదార్చడం కోసం ఏమైనా చేయాలని భావించారు. అనుకున్నదే తడవుగా.. ఊరంతా విరాళాలు సేకరించి.. భారీగా నగదు జమ చేశారు. ఆ మొత్తం నుంచి కొంత ఖర్చు చేసి ఓ స్కార్పియో ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. అనంతరం గ్రామస్తులు ఓ భారీ సమావేశం నిర్వహించి.. ధర్మపాల్‌కు 2.11 కోట్ల రూపాయల నగదుతో పాటు స్కార్పియో వాహనాన్ని బహుకరించారు. అంతేకాక ఈ సందర్బంగా ధర్మపాల్‌కు తలపాగా తొడిగి.. పూలమాలతో సత్కరించారు.
గ్రామస్తులు తనపై చూపుతున్న ప్రేమకు ధర్మపాల్ ఆశ్చర్యపోయాడు. అయితే ఈ అభిమానం ఎన్నికల్లో గెలుపు, ఓటములను నిర్దేశించలేదని తెలిపాడు. తనమీద ఇంత ప్రేమ చూపిన ప్రజల పట్ల జీవితాంతం కృతజ్ఞతగా ఉంటానని వెల్లడించాడు. అలానే ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థి మీద కూడా తనకు ఎలాంటి అసూయ, ద్వేషం లేవని.. ప్రజల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపాడు. ఇదంతా చూసిన వారు.. గెలిచిన వాడి కంటే.. ఓడిన వ్యక్తికే అధికం లాభం చేకూరింది కదా.. దేనికైనా అదృష్టం ఉండాలి అని కామెంట్స్ చేస్తున్నారు.