హనుమాన్ జయంతి ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతలను పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.
దేశంలో ఇటీవల శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. రామనవమిని ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సీతారాముల కల్యాణాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున రామాలయాలకు తరలివచ్చారు. అయితే ఈ వేడుకల సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన కేంద్ర సర్కారు.. రేపటి (ఏప్రిల్ 6) హనుమాన్ జయంతి ఉత్సవాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) ట్విట్టర్లో వెల్లడించింది.
‘హనుమాన్ జయంతి ఏర్పాట్లకు సంబంధించి దేశంలోని అన్ని రాష్ట్రాలకు హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పండుగ శాంతియుతంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాలు చూడాలి. ఆ సమయంలో శాంతి భద్రతలను సర్కారు రక్షించాలి. సమాజంలో మత సామరస్యానికి భంగం కలిగించే ముప్పును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి’ అని హోంశాఖ అన్ని రాష్ట్రాలను కోరింది. కాగా.. ఇటీవల నవమి ఉత్సవాల సందర్భంగా వెస్ట్ బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి.. పలు వెహికిల్స్‌కు నిప్పు పెట్టారు. కొన్ని దుకాణాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనల నేపథ్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం కేంద్ర బలగాల సాయం తీసుకోవాలని ఆ రాష్ట్ర సర్కారును కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది.
Ministry of Home Affairs issues an advisory to all States in preparation for #HanumanJayanti tomorrow
MHA encourages all State govts to ensure maintenance of law & order,peaceful observance of festival and monitoring of any factors that could disturb communal harmony in society pic.twitter.com/BldZYEfV2W
— All India Radio News (@airnewsalerts) April 5, 2023